
- అర్బన్ లోని కొత్త కాలనీలకు ప్రాధాన్యం
- విద్యార్థులు, తల్లిదండ్రులకు తప్పనున్న కష్టాలు
- కొత్త స్కూల్స్ తో టీచర్ల సర్దుబాటు
నిర్మల్, వెలుగు: విద్యారంగ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు లేని బడులను గత ప్రభుత్వం మూసివేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా పిల్లలున్నచోట బడులు ఏర్పాటు చేస్తోంది. 20 మందికి పైగా పిల్లలున్న ప్రాంతంలో కొత్తగా స్కూళ్లను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆదేశాలు సైతం జారీ చేసింది. దీనికి అనుగుణంగానే ఉమ్మడి జిల్లాలో మొత్తం కొత్తగా 19 ప్రాథమిక పాఠశాలలను కొత్తగా మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
డిప్యూటేషన్‌పై వచ్చే టీచర్ల జాబితా సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో చేపడుతున్న అభివృద్ధి చర్యలకు తోడు ఇటీవల విద్యాశాఖ చేపట్టిన బడిబాటతో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈసారి అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు కొత్త బడుల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ఇచ్చింది. మంచిర్యాల జిల్లాలో 14, నిర్మల్ జిల్లాలో 5 కొత్త స్కూళ్లు ఏర్పాటు చేయబోతున్నారు. బడిబాటలో భాగంగా గుర్తించిన 1254 విద్యార్థులకు ఈ స్కూళ్లలో అడ్మిషన్లు కల్పించనున్నారు. కొత్త స్కూళ్లకు భవనం, ఇతర సౌకర్యాలు వెంటనే కల్పించాలని, టీచర్లను డిప్యూటేషన్‌పై నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇతర సౌకర్యాల కల్పనపై డీఈవోలు దృష్టిపెట్టారు. డిప్యూటేషన్‌పై నియమించబోయే టీచర్ల జాబితాను కూడా సిద్ధం చేశారు.
గుర్తించి పట్టణ ప్రాంతాల్లో..
మంచిర్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ 14 స్కూళ్లు ఏర్పాటు చేయబోతున్నారు. మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీ, ఎల్ఐసీ కాలనీ, గో సేవా మండల్ ప్రాంతంలో, నస్పూర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, సుభాష్ నగర్ లో కొత్త స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. లక్షెట్టిపేటలోని గోదావరి రోడ్ వీకర్ సెక్షన్, గొల్లగూడ మోదెలలో, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో బీజోన్ సెంటర్ పార్క్, కాకతీయ కాలనీ, నాగార్జున కాలనీ క్వార్టర్స్, శేషపల్లి, శ్రీనివాస్ నగర్ లో, మందమర్రి మున్సిపాలిటీ పరిధి బుడదగూడెం, పాకిస్తాన్ క్యాంపులో కొత్త బడులు ఏర్పాటు చేయబోతున్నారు.
నిర్మల్ జిల్లాలో ఐదు స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. నిర్మల్ టౌన్ లోని మహాలక్ష్మి వాడ, ఎల్లాపెల్లి డబుల్ బెడ్రూం కాలనీ లో ఒక్కో స్కూల్, ఖానాపూర్లోని కుమ్రం భీం చౌరస్తాలోని డబుల్ బెడ్రూం కాలనీలో, మండలంలోని రంగపేట, భైంసా మండలంలోని బాబుల్ గావ్తో కొత్తగా బడులు ఏర్పాటు చేయబోతున్నారు.
తప్పనున్న తిప్పలు
తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కష్టాలు తప్పనున్నాయి. నిర్మల్ జిల్లాలోని మహాలక్ష్మి వాడ ప్రాంతంలో నివసించే విద్యార్థులు దూరంగా ఉన్న అనంతపేట గ్రామానికి అలాగే బంగల్పేట్లోని ప్రైమరీ స్కూల్‌కు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు. ఈ స్కూల్ దూరంగా ఉండటంతో తమ పిల్లలను ఆటోల్లో, బైక్‌లపై దింపి పడుతున్న ఇబ్బందులు ఇకపై తీరనున్నాయి. డబుల్ బెడ్రూంల వద్ద కూడా ఎక్కువ జనాభా నివసిస్తున్న కారణంగా అక్కడి పిల్లలకు సమీపంలో స్కూళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. డబుల్ బెడ్రూం కాలనీలోనే స్కూళ్లు ఏర్పాటు కాబోతుండడంతో ఆ ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.