డ్రైవర్​లెస్ ట్రాక్టర్​!..పొలం కూడా దున్నుతుంది

డ్రైవర్​లెస్ ట్రాక్టర్​!..పొలం కూడా దున్నుతుంది

అది రాజస్తాన్​లోని ఓ పల్లెటూరు. ఓ రోజు పొద్దున్నే ఊరి జనాలంతా పార, పలుగు పట్టుకొని పొలంబాట పట్టారు. అంతలోనే వెనక నుంచి హారన్​ సౌండ్​.. అందరూ పక్కకు జరిగారు. వాళ్లందరి మధ్యలో నుంచి ఓ ట్రాక్టర్​ వేగంగా దూసుకెళ్లింది. అంతే.. జనాలంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఆ ట్రాక్టర్​ వెనకాలే పరుగులు పెట్టారు. తీరా ఆ ట్రాక్టర్​ ఓ పొలంలోకి వెళ్లి దున్నడం మొదలుపెట్టింది. అప్పటిదాకా ఆశ్చర్యంగా చూసిన వాళ్లంతా భయంతో పరుగులు తీశారు. ఎందుకంటే డ్రైవర్​ లేకుండానే ఆ ట్రాక్టర్​ పొలాన్ని దున్నేసింది.

డ్రైవర్ ​లెస్​ కార్లు, బస్సులు తయారుచేయడానికి బడాబడా కంపెనీలే  రకరకాల ప్రయోగాలు చేసి ఫెయిల్​ అవుతుంటే… డిగ్రీ చదువుతున్న ఓ పల్లెటూరి కుర్రాడు ఏకంగా ఓ డ్రైవర్​లెస్​ ట్రాక్టర్​నే తయారుచేశాడు. దాంతో పొలాన్ని దున్నుతూ, మిగతా వ్యవసాయ పనులన్నీ చేస్తూ ఔరా.. అనిపిస్తున్నాడు. అయితే అతనేమీ ఇంజనీరింగ్​ చదవలేదు. టెక్నాలజీతో అసలు ఏమాత్రం సంబంధంలేని బీఎస్సీ సెకండియర్​ చదువుతున్నప్పటికీ ఈ డ్రైవర్​లెస్​ ట్రాక్టర్​ను తయారుచేసి ఎందరి నుంచో ప్రశంసలు అందుకుంటున్నాడు.

నాన్నకోసం..

రాజస్తాన్​లోని బారన్​ జిల్లా, బామొరి కలాన్​ గ్రామానికి చెందిన యోగేశ్ నగార్​.. ఇక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటాలో చదువుకుంటున్నాడు. ఓ రోజు ఇంటి నుంచి ఫోన్​ వచ్చింది. నాన్నకు బాగాలేదని, వెంటనే రమ్మని అమ్మ ఫోన్​ చేసింది. వెంటనే ఊరికి వెళ్లిన యోగేశ్​కు నాన్న పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. డాక్టర్​ను అడిగితే.. ప్రమాదమేమీ లేదని, అయితే బరువైన పనులేవీ చేయకుండా చూడాలని సలహా ఇచ్చాడు. వ్యవసాయమే ఆధారమైన ఆ కుటుంబానికి పెద్దదిక్కు వాళ్ల నాన్నే. ఆయన వ్యవసాయం చేస్తేనే ఇల్లు గడిచేది.. యోగేశ్​ చదువు సాగేది. పోనీ నాన్నకు రెస్ట్​ తీసుకోమని చెప్పి, తాను వ్యవసాయం చేద్దామన్నా యోగేశ్​కు ఏమాత్రం అవగాహన లేదు. పైగా తాను వ్యవసాయం చేయడానికి నాన్న కూడా ఒప్పుకోడు.  నాన్న ఊరికే ఉండలేడు. దీంతో చేసే వ్యవసాయమేదో నాన్నకు కష్టం కాకుండా ఉండాలనే లక్ష్యంతోనే డ్రైవర్​లెస్​ ట్రాక్టర్​ తయారు చేయాలి అనుకున్నాడు యోగేశ్​.

కేవలం 2000 రూపాయలతో..

ఆరోగ్యం కాస్త కుదుటపడగానే మళ్లీ నాన్న ట్రాక్టర్​ నడుపుతూ ఇబ్బంది పడడాన్ని యోగేశ్​ చూడలేకపోయాడు. ట్రాక్టర్​ కుదుపులు నాన్న ఆరోగ్యాన్ని మరింతగా దిగజారుస్తున్నాయని గుర్తించాడు. ఓ రోజు నాన్నను ఇంట్లోనే కూర్చోమని చెప్పి తాను ట్రాక్టర్​ తీసుకొని పొలానికి బయల్దేరాడు. పొలం దున్నుతుంటే యోగేశ్​కు ఓ ఆలోచన వచ్చింది. డ్రైవర్​ లేకుండానే ఈ ట్రాక్టర్​ పనిచేసేలా చేస్తే ఎలా ఉంటుంది? అని అనుకున్నాడు. డ్రైవర్​లెస్​ ట్రాక్టర్ తయారు చేస్తానని చెప్పడంతో ఫ్రెండ్స్​ అంతా నవ్వుకున్నారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ఇంట్లో నుంచి 2000 రూపాయలు తీసుకొని కోటాకు వెళ్లాడు. ట్రాక్టర్​ రిమోట్​ తయారుచేసేందుకు అవసరమైన అన్ని ఎలక్ట్రానిక్​ గాడ్జెట్లను కొన్నాడు. ఒకవేళ తన ఐడియా సక్సెస్​ కాకపోతే ఈ డబ్బంతా వృథా అవుతుందేమోనని భయపడ్డాడు. ఏదైతే అదవుతుందనుకొని ఇంటికి బయల్దేరాడు.

అప్పు తెచ్చి మరీ..

రోజంతా పొలం పనులు చూసుకొని, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత రిమోట్​ తయారుచేసే పనులను ఒక్కొక్కటిగా పూర్తిచేసేవాడు. మొదట ట్రాక్టర్​ను ముందుకు, వెనక్కి వెళ్లేలా చేయగలిగాడు. దీంతో యోగేశ్​ టాలెంట్​ మీద ఇంట్లోవాళ్లకు నమ్మకం కుదిరింది. మనిషి లేకుండా ఆపరేట్​ చేయాలంటే కనీసం 50,000 రూపాయలు కావాలని నాన్నను అడిగాడు. దీంతో తనకు తెలిసినవాళ్ల దగ్గర నుంచి అప్పు తెచ్చి కొడుకును ప్రోత్సహించాడు యోగేశ్​ నాన్న.

ఎన్నో మోడిఫికేషన్స్​…

మామూలుగా ఓ బైక్​కు కొత్త లుక్​ తేవాలంటేనే ఎన్నో మోడిఫికేషన్స్​ అవసరమవుతాయి. అలాంటిది ట్రాక్టర్​ను డ్రైవర్​లెస్​గా మార్చాలంటే.. ? యోగేశ్​ కూడా తాను తయారుచేయాలనుకున్న ట్రాక్టర్​ కోసం ఎన్నో మోడిఫికేషన్స్​ చేశాడు. దాదాపు ఆరునెలలపాటు నిద్రాహారాలు మాని పనిచేశాడు. ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు.

ఊరోళ్లంతా నోరెళ్లబెట్టారు..

పూర్తిస్థాయిలో డ్రైవర్​లెస్​ ట్రాక్టర్ సిద్ధమయ్యాక.. నాన్నతో బైక్​పై వెళ్తూ ట్రాక్టర్​ను రిమోట్​తో ఆపరేట్​ చేశాడు యోగేశ్. దీంతో అసలు డ్రైవరే లేకుండా ట్రాక్టర్​ వెళ్తుంటే చూసి ఊరోళ్లంతా నోరెళ్లబెట్టారు. అలా ఆ ట్రాక్టర్​ను తన పొలంలోకి తీసుకెళ్లి.. గట్టుమీదే కూర్చుండి పొలమంతా దున్నేశాడు. ఇదంతా చూస్తున్న ఊళ్లోవాళ్లు అసలేం జరుగుతోందో అర్థం చేసుకోలేకపోయారు. స్టీరింగ్​ దానంతట అదే తిరగడం, గేర్లు వాటంతటవే మారడం, కల్టివేటర్​ అవసరమైనచోట భూమిలోకి దిగిపోవడం, అవసరం లేనిచోట పైకిరావడం..ఇదంతా చూసి కొందరైతే ఏదో శక్తి ట్రాక్టర్​ను నడుపుతుందనుకొని అక్కడి నుంచి భయపడి వెళ్లిపోయారు.  ఇదంతా కిలోమీటర్​ దూరం నుంచి యోగేశ్​ ట్రాక్టర్​ను ఆపరేట్​ చేస్తున్నాడని తెలుసుకొని నమ్మలేకపోయారు.

రోడ్డుపై అనుమతి లేదు..

డ్రైవర్​లెస్​ ట్రాక్టర్​ను తయారుచేసినా దానిని ఉపయోగించేందుకు ముందు అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయితే యోగేశ్​ స్వయంగా అధికారులతో మాట్లాడి, తన తండ్రి పరిస్థితి వివరించడంతో అధికారులు అంగీకరించారు. అయితే రోడ్డుమీద మాత్రం డ్రైవర్​ ఉండాల్సిందేనని చెప్పారు. పొలం పనులు చేసేటప్పుడు మాత్రమే రిమోట్​ను ఉపయోగించాలని సూచించారు.

తండోపతండాలుగా..

యోగేశ్​ తయారుచేసిన ట్రాక్టర్​ను చూడ్డానికి రాజస్తాన్​ నుంచే కాకుండా పక్కరాష్ట్రాల నుంచి కూడా వందలాది మంది రావడం మొదలైంది. పేపర్లలో, టీవీల్లో యోగేశ్​ గురించి రకరకాల కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో రాజస్తాన్​లో యోగేశ్​ ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ.

సైన్యం కోసం ఓ వెహికిల్​..

యోగేశ్​ టాలెంట్​ గురించి తెలుసుకున్న గుజరాత్​లోని నేషనల్​ ఇన్వెన్షన్​ ఫౌండేషన్ అధికారులు స్వయంగా రాజస్తాన్​ వచ్చి ట్రాక్టర్​ను పరిశీలించారు. తాము సైన్యం కోసం ఇలాంటిదే ఓ వెహికిల్​ను తయారు చేస్తున్నామని, ఆ ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు. దీంతో యోగేశ్​ కూడా సంతోషంగా అంగీకరించాడు.

యాంటీ థెఫ్ట్​ అలారమ్​​..

డ్రైవర్​లెస్​ ట్రాక్టర్​తో ఫేమస్​ అయినప్పటికీ ఇలాంటివి ఎన్నో తయారుచేశాడట యోగేశ్. ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు.. ఆ తాళాన్ని ఎవరైనా తాకినా, పగలగొట్టే ప్రయత్నం చేసినా వెంటనే ఇంటి యజమానికి ఎస్సెమ్మెస్​ వెళ్లేలా ‘యాంటీ థెఫ్ట్​ అలారమ్​’ను కూడా యోగేశ్​ తయారుచేశాడు.

నాన్న హ్యాపీ..

తన కొడుకు గురించి తండ్రి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘యోగేశ్​ మీద చిన్నప్పటి నుంచి నాకు నమ్మకం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే దానికోసం ఎంతో కష్టపడతాడు. నా ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంటనే చదువు మానేసి ఇంటికొచ్చేశాడు. దానికి నేను ఎంతో బాధపడ్డా. అయితే ఈరోజు యోగేశ్​ సాధించిన  ఘనతను చూసి గర్వపడుతున్నా. కొత్త కొత్త విషయాలు కనిపెట్టాలంటే పెద్దపెద్ద చదువులే అక్కర్లేదు. కొన్నిసార్లు మన అవసరం కూడా ఆవిష్కరణలకు కారణమవుతుంది. నా కొడుకు విషయంలో కూడా అదే జరిగింది. నాన్న కష్టపడకూడదన్న ఆలోచనే యోగేశ్​తో ఈ ట్రాక్టర్​ తయారుచేయించింది. ఇప్పుడు సైన్యం కోసం ఓ వెహికిల్​ తయారుచేసే పనిలో ఉన్నాడు. ఇది నాకు మరింత గర్వంగా ఉంది. నా కొడుకును ప్రోత్సహిస్తే మరెన్నో అద్భుతాలు సాధిస్తాడ’ని చెప్పాడు.