
హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1,906 దరఖాస్తులు వచ్చాయి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఫిర్యాదులు అధికారులకు అందజేస్తున్నారు. అప్లికేషన్లు తీసుకుని ఫిర్యాదుదారునికి ఒక నంబర్‌ను అధికారులు కేటాయిస్తున్నారు.
అదేవిధంగా, రెఫరెన్స్ కోసం వారి సెల్‌ఫోన్ నంబర్‌కు మెసేజ్ కూడా పంపుతున్నారు. కాగా, శుక్రవారం ప్రజావాణి దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన జనాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాసేపు మాట్లాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో ఒకరిద్దరి నుంచి దరఖాస్తులు తీసుకున్న భట్టి.. సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు.