ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇళ్లలో పని చేసే మొదటి హ్యూమనాయిడ్ రోబోట్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ AI రోబోట్ పేరు 'నియో'. ఇది మనిషి ఆకారం, రూపంలో ఉంటుంది, అలాగే బట్టలు ధరించి వస్తుంది. ఇల్లు శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం, కుక్కలకు ఆహారం పెట్టడం వంటి పనులు చేయగలదు.
మీరు నెలకు 44 వేలు లేదా 17లక్షలు ఖర్చు చేయడానికి రెడీ ఉంటే మీ ఇంటి పనిమనిషి ప్లేస్లో ఈ AI రోబోట్ భర్తీ చేయగలదు. US-ఆధారిత రోబోటిక్స్ కంపెనీ 1X ఈ హ్యూమనాయిడ్ రోబోట్‌ను తయారు చేసింది అంతేకాదు ఇళ్లలోకి రోబోట్‌లను తీసుకువచ్చిన మొదటి కంపెనీ కూడా ఇదే.
1X కంపెనీ సోషల్ మీడియా ద్వారా ఈ మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్‌ను లాంచ్ చేసింది. ఈ రోబోట్ ప్రస్తుతం USలో ప్రీ-ఆర్డర్స్ కోసం రెడీగా ఉంది. 2026 నుండి డెలివరీలు మొదలవుతాయి. US కాకుండా ఇతర దేశాల్లో ఎప్పుడు లభిస్తుందో సమాచారం లేదు. నియో ఇంట్లో చెత్త శుభ్రం చేయడం, మొక్కలకు నీరు పోయడం లేదా డోర్స్ తెరవడం వంటి చిన్న చిన్న పనులు చేయగలదు.
ఇది రెడ్‌వుడ్ AI (1X జనరలిస్ట్ AI మోడల్)ని ఉపయోగించి పనులను నేర్చుకుంటుంది అలాగే వాటిని తిరిగి చేయగలదు. కంపెనీ ప్రకారం మొదట్లో రోబోట్ కొద్దిగా ఆటోమేషన్‌తో వస్తుంది, కానీ మెల్లిమెల్లిగా దాని సామర్థ్యం పెరుగుతుంది.
నిపుణుల మోడ్ (Expert Mode): ఇల్లు సర్దడం లేదా బట్టలు ఉతకడం వంటి కష్టమైన పనుల కోసం ఈ రోబోట్ ఎక్స్పర్ట్ మోడ్‌లోకి వెళ్లగలదు. కొత్త పనులు నేర్చుకునేలా, పని చేయడంలో సహాయపడేలా 1X కంపెనీకి చెందిన ఒక 'నిపుణుడు' రోజుకి ఒకసారి నియో పనులను రిమోట్‌గా పర్యవేక్షిస్తాడు. ఈ రోబోట్ ఉపయోగకరంగా ఉండాలంటే మీరు దీనిని అంగీకరించాలి అని 1X వ్యవస్థాపకుడు అండ్ CEO బెర్ంట్ బోర్నిచ్ వివరించారు.
నియో దానంతట అదే ఛార్జ్ చేసుకోగలదు. అంటే మీరు దాన్ని ఛార్జ్ చేయనవసరం లేదు. ఛార్జింగ్ అవసరమైనప్పుడు దానంతట అదే ప్లగ్ ఇన్ అవుతుంది. ఇంకా మీరు మొబైల్ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండైనా నియో ఎం చేస్తుందో చూడవచ్చు. ఇంటి పనిమనిషిగా ఉండటమే కాకుండా, నియో మొబైల్ బ్లూటూత్ స్పీకర్‌గా కూడా పనిచేయగలదు.
మెమరీ నిలుపుదల (గుర్తుంచుకోవడం), ఆడియో ఇండికేషన్స్, మాటల సందర్భాన్ని అర్థం చేసుకోవడం, మంచి సంభాషణల కోసం దృశ్య మేధస్సును ఉపయోగించడం, అవసరమైన చోట నావిగేట్ (తిరగడానికి) చేయడానికి AIని ఉపయోగించడం వంటివి చాల ఫీచర్లు ఈ రోబోట్ కి ఉన్నాయి. నియో ధరించే సూట్‌ను మెషిన్ వాష్ చేయవచ్చని కూడా కంపెనీ తెలిపింది. 1x కంపెనీ ప్రకారం, ఈ రోబోట్ మెల్లిమెల్లిగా అన్ని నేర్చుకుంటుంది. మొదట్లో మనుషుల సహాయం అవసరం కావచ్చు, కానీ చివరికి నియో ఇంటి పనులు, అలవాట్లు నేర్చుకుని దానికి తగ్గట్టుగా పనులు చేస్తుంది.
