మహారాష్ట్రలో కూటముల పోరు

మహారాష్ట్రలో కూటముల పోరు
  •     శివసేన, ఎన్ సీపీలో చీలికలతో వింత పరిస్థితులు 
  •     లోకల్ సమస్యలూ పోలింగ్​ను ప్రభావితం చేసే చాన్స్ 
  •     యూపీ తర్వాత అత్యధికంగా రాష్ట్రంలో 48 సీట్లు
  •     మొత్తం 5 విడతల్లో జరగనున్న పోలింగ్

ముంబై:  లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. రాష్ట్రంలో ప్రధానంగా రెండు కూటముల మధ్యే టఫ్ ఫైట్ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార మహాయుతి కూటమి (ఎన్డీఏ)లో శివసేన (షిండే), బీజేపీ, ఎన్ సీపీ (అజిత్ పవార్) పార్టీలు.. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఇండియా అలయెన్స్)లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్ సీపీ (శరద్ చంద్ర పవార్) పార్టీలు ఉన్నాయి. అయితే, శివసేన, ఎన్ సీపీ పార్టీలు చీలిపోయి ఆ కూటమిలోకి రెండు, ఈ కూటమిలోకి రెండు పార్టీలు చేరడంతో ఈ పార్టీల ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారోనన్నది విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. 

మరోవైపు మరాఠా రిజర్వేషన్లు, రైతు సమస్యలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వంటివి కూడా ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళిని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే, దేశంలోనే అత్యధికంగా యూపీలో 80 లోక్ సభ సీట్లు ఉండగా.. ఆ తర్వాత మహారాష్ట్రలో అత్యధికంగా 48 సీట్లు ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడంపై ఇటు ఎన్డీఏ కూటమి, అటు ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఇక్కడి ఎన్నికల్లో ఓటర్ల నాడిని పట్టడం అంత సులభం కాకపోవడంతో ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుందన్నదీ తేల్చడం కూడా అంత ఈజీ కాదని చెప్తున్నారు. కాగా, మహారాష్ట్రలో 5 ఫేజ్ లలో (ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20 తేదీల్లో) పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న ఫస్ట్ ఫేజ్ లో రాంటెక్, నాగ్ పూర్, భాంద్రా- గోండియా, గడ్చిరోలి-చిమూర్, చంద్రాపూర్ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. 

ఎన్నికల్లో కీలక అంశాలు ఇవే..

మరాఠా రిజర్వేషన్లు:  మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మరాఠా రిజర్వేషన్ల అంశం కీలకంగా మారనుంది. మరాఠాలకు ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తూ గత ఆగస్ట్ లో మరాఠా క్రాంతి మోర్చా నేత మనోజ్ జరంగే పాటిల్ ఆమరణ దీక్ష చేపట్టడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కేటగిరీలో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయం సరికాదని, వీరు వెనుకబడిన తరగతుల కిందకు రారు అని  కొందరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

రైతు సమస్యలు:  మహారాష్ట్రలో రైతు సమస్యలు కూడా ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతను మార్చనున్నాయి. అందుకే రైతులకు తాము ప్రవేశపెట్టిన పథకాలను అధికార కూటమి ప్రచారం చేస్తుండగా.. రైతు ఆత్మహత్యల మాటేమిటని ప్రతిపక్ష కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. పంటలకు సరైన మద్దతు ధర కూడా కల్పించడం లేదని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రచారం చేస్తున్నారు. 

ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు: రాష్ట్రంలో చేపట్టిన భారీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. 701 కిలోమీటర్ల ముంబై–నాగ్ పూర్ సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే, 21.8 కిలోమీటర్ల ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్, ముంబై కోస్టల్ రోడ్డు, మెట్రో రైల్ ప్రాజెక్టు వంటి పూర్తిగా లేదా పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టులను జనాల్లోకి తీసుకెళ్లేందుకు అధికార కూటమి ప్రయత్నిస్తోంది. ముంబై నుంచి షిర్డీ, సోలాపూర్, జల్నా సిటీలకు వందే భారత్ ట్రెయిన్లు ప్రారంభించడాన్నీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. ఇవన్నీ ఆయా సెగ్మెంట్లలో ఓటింగ్ సరళిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

సీట్ల సర్దుబాటు ఇలా.. 

ఇండియా కూటమి: ఇందులో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్ సీపీ (శరద్ చంద్ర పవార్) ఉన్నాయి. ఈ కూటమిలో కాంగ్రెస్ 17, శివసేన (యూబీటీ) 21, ఎన్ సీపీ (శరద్ చంద్ర పవార్) 10 సీట్లలో పోటీ చేస్తున్నాయి. 

ఎన్డీఏ: ఇందులో బీజేపీ, శివసేన (షిండే), ఎన్ సీపీ (అజిత్ పవార్), రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీలు ఉన్నాయి. ఈ కూటమిలో రాష్ట్రీయ సమాజ్ పక్షకు ఒక సీటును కేటాయించారు. మిగతా మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరగాల్సి ఉంది. 

ఒపీనియన్ పోల్ అంచనాలు ఇలా.. 

న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్​లో.. 48 సీట్లలో ఎన్డీఏ కూటమి ఏకంగా 41 సీట్లను గెలుచుకుంటుం దని అంచనా వేశారు. ఈ కూటమికి మొత్తం 48% ఓట్ షేర్ దక్కుతుందని పేర్కొన్నారు. ఇక ఇండియా కూటమి 34% ఓట్ షేర్ తో 7 సీట్లను మాత్రమే గెలుచుకుంటుందని ఈ సర్వేలో అంచనా వేశారు.