
మన మానసిక స్థితి, జ్ఞాపకశక్తి ,శక్తి స్థాయిలకు నిద్ర ఎంత ముఖ్యమో మనందరికి తెలుసు. కానీ ఒక రాత్రి పూర్తిగా నిద్ర లేమి కూడా మీ కండరాలు ,హార్మోన్లను ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? కొత్త పరిశోధన ప్రకారం..నిద్ర లేకపోవడం మిమ్మల్ని అలసిపోయేలా చేయడమే కాకుండా మీ శరీరం కండరాల అభివృద్ధి కష్టతరం అవుతుంది.
కండరాల ఆరోగ్యానికి నిద్ర ఎందుకు ముఖ్యం..
మన కండరాలు నిరంతరం తమను తాము డెవలప్ చేసుకుంటాయి. ప్రతిరోజూ పాత కండరాల ప్రోటీన్లు విచ్ఛిన్నమవుతూ కొత్తవి కండరాల ప్రోటీన్ సంశ్లేషణ ప్రక్రియలో తయారవుతాయి. ముఖ్యంగా మనం వయసు పెరిగే కొద్దీ లేదా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించినప్పుడు కండరాలను బలంగా ఉంచడానికి ఇది చాలా కీలకం.
అధ్యయనం ఏమి చెబుతుందంటే..
ప్రోటీన్ సంశ్లేషణ ప్రక్రియను నడిపించడంలో వ్యాయామం, తగినంత ప్రోటీన్ తినడం,టెస్టోస్టెరాన్,కార్టిసాల్ వంటి హార్మోన్లు వంటి అనేక అంశాలు సహాయపడతాయి.- ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే..నిద్ర లేమి తర్వాత కండరాల ప్రోటీన్ సంశ్లేషణ 18% తగ్గింది.ముఖ్యంగా పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు 24% తగ్గాయి.కార్టిసాల్ స్థాయిలు 21% పెరిగాయి. ఇది కండరాల విచ్ఛిన్నానికి దారితీస్తుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పరిశోధనల్లో పాల్గొనేవారు ఎప్పటిలాగే భోజనం చేసినప్పటికీ ఈ మార్పులు సంభవించాయి. అంటే నిద్ర లేకపోవడం వల్ల వారి శరీరాలు ఆహారం నుంచి వచ్చే సాధారణ కండరాల నిర్మాణ సంకేతాలకు తక్కువ ప్రతిస్పందనను కలిగిస్తాయి.పరిశోధనలో 13 మంది ఆరోగ్యవంతులైన యువకులు(పురుషులు, మహిళలు ) పాల్గొనగా.. ఒకరాత్రి సాధారణ నిద్ర, ఒక రాత్రి నిద్రలేమి తో పరిశోధనలు చేస్తే పైన తెలిపిన రిజల్ట్స్ వచ్చాయి.
దీనర్థం.. వ్యాయామం చేయడం, తగినంత ప్రోటీన్ తినడం, చురుకుగా ఉండటం వంటి అన్ని పనులను సరిగ్గా చేస్తున్నప్పటికీ రాత్రిపూట నిద్రలేకపోవడం వల్ల కండరాల నిర్మాణం తగ్గుతుందని తెలుస్తోంది.
నిద్రలేమి అలవాటుగా మారితే సార్కోపెనియా అంటే వయస్సు సంబంధ కండరాల నష్టం, బలహీనత, గాయాలనుంచి త్వరగా కోల్కోకపోవడం వంటి నష్టాలు వాటిల్లుతాయి.
కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..
- క్రమం తప్పని నిద్ర షెడ్యూల్ పెట్టుకోవాలి.ప్రతి రోజు 7నుంచి 9 గంటల నాణ్యమైన నిద్రకు ప్రయత్నించాలి
- ఒకరాత్రి నిద్ర తప్పిపోతే తిరిగి తిరిగి కోలుకోవడంపై దృష్టి పెట్టాలి.
- మంచినిద్రపోవాలి.. తగినత ప్రోటీన్ తీసుకోవాలి..స్వల్ప వ్యాయామం చేయాలి.
- అధిక కార్టిసాల్ కండరాలపై ప్రభావం చూపుతుంది.. అందుకే రిలాక్సేషన్ ద్వారా ఒత్తిడిని జయించాలి.
- నిద్రలేకపోతే బద్ధకంగా అనిపిస్తుంది. శరీరం నీరసంగా ఉంటుంది. ఒక రాత్రి నిద్ర లేకపోవడం వల్ల కండరాల నిర్మాణం తగ్గిపోయి ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయని అధ్యయనం చెబుతోంది. అందుకే ఆరోగ్యం, బలం, ఫిట్ నెస్ వంటి లక్ష్యాలున్నవారు తప్పనిసరిగా ప్రతి రాత్రి మంచి నిద్రతో విశ్రాంతి తీసుకోవాలి.