బెంగళూర్: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. పోలీసులు ఎంత అవగాహన కల్పించిన కొత్త కొత్త మార్గాల్లో జనాల్ని నిండా ముంచుతున్నారు. చీటింగ్‌కు కాదేది అనర్హం అన్నట్లుగా ఏ చిన్న అవకాశం దొరికిన వదలకుండా జనాల్ని నట్టేట ముంచుతున్నారు. ఈ కేవైసీ, ఓటీపీ అంటూ లింక్‌లు పంపి జనాల్ని బురిడి కొట్టిస్తున్నారు. ఐటీ రాజధాని బెంగళూరులో తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ చలాన్ పేరుతో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.2.7 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. అయితే.. ఇక్కడ బాధితులు ఓటీపీ చెప్పకుండానే బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల డబ్బు కొట్టేయడం గమనార్హం.
పోలీసుల వివరాల ప్రకారం.. బెంగుళూరులో జాబ్ చేస్తోన్న ఓ 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇందులో ట్రాఫిక్ చలాన్ చెల్లించాలని ఒక లింక్ పంపారు. నిజంగా ఇది ట్రాఫిక్ పోలీసులే పంపరేమోననుకోని సదరు వ్యక్తి ఆ లింక్‌పై క్లిక్ చేశాడు. అంతే ఇంకేముంది అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 1.1 లక్షలు స్వాహా అయ్యాయి. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఓటీపీ చెప్పకుండానే నిందితుల తన ఖాతా నుంచి డబ్బు కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరో ఘటనలో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న టీచర్ ను కూడా ఇదే తరహాలో మోసం చేశారు కేటుగాళ్లు. ట్రాఫిక్ చలాన్ చెల్లించాలంటూ లింక్ పంపి.. బాధితుడి క్రెడిట్ కార్డ్ నుంచి రూ.1.6 లక్షలు కొట్టేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ మోసపోయిన బాధితులిద్దరూ ఒకే బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డులు వాడుతున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.
ట్రాన్స్క్షన్, సాంకేతిక ఆధారాలను ఉపయోగించి నిందితులను ట్రాక్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి సైబర్ నేరాల పట్ల ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీసులు వ్యక్తుల నుండి నేరుగా చెల్లింపు లింక్‌లను పంపరని తెలిపారు. అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని చెప్పారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే లింక్ లను క్లిక్ చేయొద్దని సూచించారు. ఓటీపీ చెప్పకుండానే సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. జనాల్ని ఇంకా ఎన్ని రకాలుగా మోసం చేస్తార్రా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
