
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసాపేట ఆంజనేయ నగర్‌లోని పార్కును డెవలప్చేయాలని ఇద్దరు చిన్నారులు సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ పార్కు అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరైనప్పటికీ, నిధులు విడుదల కానందున నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. నిధులు విడుదలైతే పార్కు నిర్మాణం పూర్తవుతుందని, తమ ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటామన్నారు.
జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణికి 62 ఫిర్యాదులు రాగా, ఆరు జోన్లలో మొత్తం 104 ఫిర్యాదులు అందాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 40, సికింద్రాబాద్ జోన్ లో 27, శేరిలింగంపల్లి జోన్ లో 18, ఎల్బీనగర్ జోన్ లో 12, చార్మినార్ జోన్ లో 7 ఫిర్యాదులను స్వీకరించారు. హెడ్ ఆఫీసులో అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. హైదరాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ అనుదీప్ ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 86 ఫిర్యాదులు రాగా, అందులో హౌసింగ్ శాఖ 40, పెన్షన్స్ 14, దివ్యాంగుల శాఖకు 8, రెవెన్యూ 13, ఇతర శాఖలకు 11 అర్జీలు అందినట్లు తెలిపారు.
వికారాబాద్: ప్రజావాణికి హాజరయ్యే జిల్లా అధికారులు సమయపాలన పాటించాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఆదేశించారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, భూ సర్వే, పౌరసరఫరాలు, హౌసింగ్, పెన్షన్లు, గ్రామీణ, పోలీస్, పంచాయతీ రాజ్ కు సంబంధించి 125 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.