మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ఈనెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్న జడ్చర్ల, బాలానగర్, భూత్పూర్, అడ్డాకల్, మూసాపేట్ మండలాల జోనల్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంఈవో, విలేజ్ సెక్రటరీలతో వెబ్ కాన్ప్ రెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ కు ముందు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్స్ లు పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద జోన్లు, రూట్ వారీగా పోలింగ్ సామగ్రి పంపిణీకి సీటింగ్, కౌంటర్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ బృందాల జాబితా అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు సరిగ్గా చేసుకోవాలని, చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్ నాయక్, జడ్పీ ఇన్చార్జి సీఈవో వెంకటరెడ్డి, ఆర్డీవో నవీన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
