- గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ప్రజల్లో కాంగ్రెస్‌కు మరింత బలం
- ఎవరూ గెలిచినా.. గ్రామాల అభివృద్ధే తన లక్ష్యం
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
మహబూబ్‌నగర్, వెలుగు : '1980 నుంచి మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల మధ్య ముఖాముఖి పోటీ ఉండేది. అప్పటి నుంచి ఇప్పటివరకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సర్పంచ్ స్థానాలకు సాధించి.. 46 ఏండ్ల రికార్డును బద్దలుకొట్టాం. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటర్లు 65 శాతం సర్పంచులను కాంగ్రెస్ బలపర్చిన క్యాండిడేట్లను గెలిపించారు' అని మహబూబ్నగర్ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
సోమవారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. అందుకే రికార్డు స్థాయిలో కాంగ్రెస్ మద్దతుదారులకు అద్భుత విజయం అందించారని చెప్పారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో 21 గ్రామ పంచాయతీలుంటే.. 13 చోట్ల ఓటర్లు కాంగ్రెస్బలపర్చిన అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకున్నారని తెలిపారు.
హన్వాడ మండలంలో 35 గ్రామ పంచాయతీలుంటే.. 22 చోట్ల కాంగ్రెస్ బలపర్చిన క్యాండిడేట్లు సర్పంచులుగా గెలిపించారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్‌కు పోలైన ఓట్లను పరిశీలిస్తే.. ఈసారి గణనీయంగా పెరిగిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్మండలంలో 9,500 ఓట్లు పోల్ కాగా.. తాజా ఎన్నికల్లో 12,500 ఓట్లు వచ్చాయని వెల్లడించారు.
హన్వాడ మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 13,950 ఓట్లు వస్తే.. ఈసారి 18,417 ఓట్లు పెరిగాయని వివరించారు. ఇది ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమన్నారు. మిగతా పార్టీలు తమకు పోటీ కాదని, వారి ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. చాలా గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారుల మధ్యే పోటీ నడిచిందని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఎక్కడా పని చేయలేదన్నారు.
స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించామన్నారు. ఈ ఎన్నికల్లో 65 శాతం సర్పంచు స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు ఓటర్లు పట్టం కట్టారని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి విలేజ్‌ను డెవలప్చేయడమే తన లక్ష్యమన్నారు. సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, నాయకులు పాల్గొన్నారు.
