అమెరికాలో దారుణం.. జంటను కాల్చి చంపేసిన దుండగుడు.. ఇద్దరూ ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులే..

అమెరికాలో దారుణం.. జంటను కాల్చి చంపేసిన దుండగుడు.. ఇద్దరూ ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులే..

వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. బుధవారం రాత్రి కేపిటల్ జ్యుయిస్ మ్యూజియం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బుధవారం రాత్రి 9 గంటల 5 నిమిషాల సమయంలో ఈ కాల్పులు జరిగాయి. చనిపోయిన ఇద్దరూ కపుల్ అని తెలిసింది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కాల్పులు జరిపిన అనంతరం.. దుండగుడు ‘‘ఫ్రీ.. ఫ్రీ.. పాలస్తీన్’’ అని స్లోగన్స్ చేసినట్లు పోలీసులు చెప్పారు. చికాగోకు చెందిన ఎలియస్ రోడ్రిగ్వెజ్ అనే 30 ఏళ్ల యువకుడిని పోలీసులు అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల అనంతరం.. మ్యూజియం లోపలికి వెళ్లేందుకు దుండగుడు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. 

చనిపోయిన ఇద్దరూ త్వరలో ఎంగేజ్మెంట్కు ప్లాన్ చేసుకున్నారని, ఇంతలోనే ఇలా జరిగిందని ఇజ్రాయెల్ అంబాసిడర్ తెలిపారు. చనిపోయిన ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని.. ఇటీవలే తన ప్రేయసికి ప్రపోజ్ చేసి ఉంగరం తొడగాలని వారం క్రితం అతను రింగ్ కూడా కొన్నాడని.. పెళ్లి తర్వాత జెరూసలెం వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. 

ఈ కాల్పుల ఘటనపై వాషింగ్టన్ పోలీసులు, ఎఫ్బీఐ విచారణ జరుపుతోంది. కేపిటల్ జ్యుయిస్ మ్యూజియంలో ఒక ఈవెంట్కు వెళుతున్న ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులైన ఈ జంటపై దుండగులు కాల్పులు జరిపి చంపేశాడు. ఈ ఘటనపై సెక్రటరీ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ క్రిస్టీ నోయెమ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.