ఒకే రోజు కూలిన అమెరికా, రష్యా అణు బాంబర్లు

ఒకే రోజు కూలిన అమెరికా, రష్యా అణు బాంబర్లు
  • కాలిఫోర్నియాలో బీ-52 బాంబర్ క్రాష్.. 8 మంది మృతి
  • సైబీరియాలో కూలిన రష్యా విమానం.. పైలట్లు సేఫ్

వాషింగ్టన్: అమెరికా, రష్యా దేశాలకు చెందిన రెండు భారీ యుద్ధ విమానాలు సోమవారం వేర్వేరు ప్రమాదాల్లో కుప్పకూలాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన 'బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్' బాంబర్ ప్లేన్ కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రన్‌‌‌‌‌‌‌‌వేపైనే కుప్పకూలి, ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని ఎనిమిది మంది సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారు. మరణించిన వారిలో సైనిక సిబ్బందితో పాటు విమానాన్ని తయారు చేసిన బోయింగ్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రమాద తీవ్రతకు ఎడారి ప్రాంతంలో భారీగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి.

రన్‌‌‌‌‌‌‌‌వే దెబ్బతినడంతో ఆ బేస్‌‌‌‌‌‌‌‌లో విమాన రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అదే టైంలో రష్యాకు చెందిన 'టీయూ-22ఎమ్‌‌‌‌‌‌‌‌3'  అనే లాంగ్-రేంజ్ సూపర్‌‌‌‌‌‌‌‌సోనిక్ బాంబర్ విమానం సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో శిక్షణ సమయంలో కూలిపోయింది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విమానంలోని నలుగురు పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి, పారాచూట్ల ద్వారా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో రెండు విమానాలు ఎలాంటి ఆయుధాలు లేకుండా ప్రయాణిస్తుండంతో భూమిపై కూడా ఎవరికీ నష్టం జరగలేదు.

దశాబ్దాలుగా రక్షణ వ్యవస్థలో భాగం

బీ-52, టీయూ-22ఎం3 భారీ విమానాలు మామూలు యుద్ధ విమానాలు కావు. శత్రుదేశాలపైకి అణు బాంబులను (న్యూక్లియర్ వెపన్స్ ) మోసుకెళ్లి, వాటిని నేరుగా లక్ష్యంపై వేయగల అత్యంత ప్రమాదకరమైనవి. హైపర్‌‌‌‌‌‌‌‌సోనిక్ క్షిపణులను ప్రయోగించగల అపార సామర్థ్యం కలవి. ఇవి దశాబ్దాలుగా అమెరికా, రష్యా దేశాల రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన ఆయుధాలుగా పనిచేస్తున్నాయి. వీటి స్థానంలో కొత్త తరం యుద్ధ విమానాలను తీసుకురావడంలో ఆలస్యం అవుతుండటంతో పాత విమానాలనే ఆధునీకరించి వాడుతున్నారు. 2016 తర్వాత అమెరికా బీ-52 విమానం 
ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి.