స్కూటీపై వెళ్తూ యువతి డ్రస్‌ పట్టుకుని ఈడ్చుకెళ్లిన దొంగలు

స్కూటీపై వెళ్తూ యువతి డ్రస్‌ పట్టుకుని ఈడ్చుకెళ్లిన దొంగలు

ఇద్దరు దుండగులు స్కూటీపై వెళ్తూ.. రోడ్డు పక్కన ఉన్న యువతిని చేతిలోని ఫోన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఫోన్‌ను గట్టిగా పట్టుకుని ఉండడంతో ఆమెను ఏకంగా 150 మీటర్ల దూరం వరకూ స్పీడ్‌గా ఈడ్చుకెళ్లి నడిరోడ్డుపై వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన గురువారం సాయంత్రం ఢిల్లీలోని షాలిమార్ బాఘ్ ఏరియాలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే ఆ స్కూటీపై వెళ్లిన దుండగుల్లో ఒకడిని అరెస్ట్ చేశామని, రెండో వాడిని పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

బాధిత యువతి (23) ఢిల్లీలోని ఫోర్టిస్‌ ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోందని పోలీసులు తెలిపారు. ఆమె గురువారం సాయంత్రం 5.35 గంటల సమయంలో షాలిమార్‌‌ బాఘ్‌లో రోడ్డు పక్కన నిల్చుని ఉండగా ఇద్దరు దుండగులు స్కూటీపై వెళ్తూ ఆమె చేతిలో ఉన్న లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఫోన్ గట్టిగా పట్టుకుని వెనక్కి తప్పించుకోవడంతో స్కూటీపై వెనుక కూర్చున్న వ్యక్తి ఆమె డ్రస్‌ను పట్టుకుని ఈడ్చుకుంటూ వేగంగా వెళ్తూ ఈడ్చుకెళ్లారు. దాదాపు 150 మీటర్ల దూరం వెళ్లాక గ్రిప్ జారిపోవడంతో రోడ్డు మధ్యలో వదిలేసి పరారయ్యారు. రోడ్డుపై ఈడ్చుకురావడంతో ఆమెకు మోకాళ్లకు గాయాలయ్యాయని, సమీపంలోని ఆస్పత్రిలో వైద్యం తీసుకున్న అనంతరం డిశ్చార్జ్‌ అయిందని పోలీసులు తెలిపారు.