తమిళనాడులో ఘోరం: రైలును ఢీకొన్న స్కూల్ బస్సు.. ముగ్గురు చిన్నారులు మృతి..

తమిళనాడులో ఘోరం: రైలును ఢీకొన్న స్కూల్ బస్సు.. ముగ్గురు చిన్నారులు మృతి..

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది.. స్కూలు బస్సు రైలును ఢీకొన్న ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మంగళవారం ( జులై 8 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కడలూరు సమీపంలోని సెమ్మన్‌కుప్పం దగ్గర జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక స్కూల్ వ్యాన్ రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నిస్తుండగా, అటుగా వస్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ వ్యాన్‌లో ఐదుగురు విద్యార్థులు మరియు ఒక డ్రైవర్ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన విద్యార్థులు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. డ్యూటీలో ఉన్న గేట్ కీపర్ నిద్రలోకి జారుకోవడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

సకాలంలో గేటు మూయకపోవడమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు స్థానికులు. గేటు కీపర్ పై ఆగ్రహంతో చెలరేగిన స్థానికులు అతనిపై దాడికి దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంతో చిన్నారుల మరణానికి కారణమైన గేటు కీపర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.