2 వేల ఎకరాల్లో వరి పంట ధ్వంసం

2 వేల ఎకరాల్లో వరి పంట ధ్వంసం

హాలియా, వెలుగు: అధికారుల నిర్లక్ష్యం వల్లే నాగార్జున సాగర్​ ఎడమ కాల్వకు గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎడమకాల్వ రిపేర్లలో నాణ్యతాప్రమాణాలను పాటించలేదని, గండి పడిన ప్రదేశం నుంచి కొన్ని నెలలుగా జాలు వస్తోందని అధికారులకు చెప్పినా జాగ్రత పడకపోవడం వల్లే గండి పడిందని విమర్శిస్తున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు స్టేజీ దగ్గరున్న యూటీ వద్ద బుధవారం సాయంత్రం ఎడమకాల్వకు భారీ గండి పడడంతో  దాదాపు రెండు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. 

పొలాల్లో ఇసుక మేటలు

కాల్వకు గండి పడడంతో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. పొలాల్లో పెద్ద ఎత్తున ఇసుకమేటలు వేసింది. పంట చేతికి రాకుండా పోయి రైతులు నష్టాల్లో కూరుకుపోగా.. ఇసుకమేటలు తొలగించడానికి కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది.  నిడమనూరు, నర్సింహులగూడెం, బంకాపురం, వెనిగండ్ల గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నదని, వరినాట్లు వరదలో  కొట్టుకుపోయిందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.  జేడీఏ సుచరిత ఆధ్వర్యంలో అధికారులు పంటలను పరిశీలించారు.  నష్ట పోయిన రైతుల వివరాలను  సేకరించారు. నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిన తర్వాత ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో అంచనా వేయనున్నారు.

ఫంక్షన్​ హాల్​లో స్టూడెంట్లకు ఆశ్రయం

నిడమనూరు ఎస్సీ హాస్టల్ లోకి వరద నీరు చేరడంతో కాంపౌండ్​వాల్​ కుప్పకూలిపోయింది. పిల్లల వస్తువులు, పుస్తకాలు కొట్టుకుపోయాయి. నిడమనూరు గురుకుల పాఠశాలలోకి నీరు చేరడంతో 87 మంది విద్యార్థులను ప్రైవేట్​ఫంక్షన్ హాల్ కు తరలించారు. చెరువు దగ్గరున్న కట్టె కోత మిల్లులు, ఇటుక బట్టీల మెషీన్​ నీటమునిగాయి. మిర్యాలగూడ, నిడమనూరు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా వేసిన తాత్కాలిక రోడ్డు దెబ్బతిన్నది. దీంతో బుధవారం రాత్రి నుంచి  మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక వైపు రోడ్డును బాగు చేసి గురువారం ఉదయం నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. గురువారం ఉదయం నరసింహులగూడెం జలదిగ్బంధం నుంచి  బయటపడింది. 

ఓఎస్డీ శ్రీధర్​ దేశ్​పాండే పరిశీలన

ఎడమకాల్వకు వద్ద గండి పడిన ప్రాంతాన్ని గురువారం ఉదయం సీఎంఓ  ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్​ దేశ్​పాండే, ఇరిగేషన్​శాఖ ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. ప్రమాదం ఎలా జరిందన్న వివరాలను సాగర్​అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై  ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని శ్రీధర్ ​దేశ్ పాండే చెప్పారు. నాగార్జున సాగర్​ ఎమ్మెల్యే నోముల భగత్​కూడా గండిని  పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

గండి పూడ్చివేత పనులు ప్రారంభం 

గండి ని పూడ్చే పనులను ఎన్​ఎస్​పీ అధికారులు ప్రారంభించారు. గండిపడిన ప్రదేశానికి 20 మీటర్ల దూరంలో ప్రధాన కాల్వలోకి దిగేందుకు ర్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం  జేసీబీతో మట్టి తొలస్తున్నారు. ఇసుక బస్తాలతో గండిని పూడ్చి మట్టికట్టవేయాలని ప్లాన్​ చేస్తున్నారు.  

గుర్తించలేకపోయాం.. మంత్రి జగదీశ్​రెడ్డి

సూర్యాపేట:  సాగర్ ఎడమ కాలువ నిండా నీరు ఉండడంతో ప్రమాదాన్ని ముందుగా పసిగట్టలేకపోయినట్టు మంత్రి  జగదీశ్​ రెడ్డి చెప్పారు. గురువారం తన క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.   కట్ట పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టామని, ఐదారు రోజుల్లో గండిని పూడ్చి   ఎడమ కాల్వకు నీళ్లు వదులుతామన్నారు.  గండి పడిన ఐదు నిమిషాల్లోనే అధికారులు అక్కడకు చేరుకుని.. నీళ్లను ఆపడానికి చర్యలు తీసుకున్నారని, దీంతో భారీ నష్టాన్ని ఆపగలిగామన్నారు. లోతట్టు ప్రాంతాల నుంచి నీటిని వేగంగా బయటకు పంపించినట్టు చెప్పారు. పంటనష్టంపై వివరాలు సేకరిస్తున్నారని, ఎవరైనా నష్టపోతే ఆదుకుంటామని హామీ ఇచ్చారు.