ఇరిగిన తలను అతికించిన్రు 12 ఏండ్ల బాలుడిని .. మెడికల్ హిస్టరీలోనే అద్భుతం

ఇరిగిన తలను అతికించిన్రు 12 ఏండ్ల బాలుడిని .. మెడికల్ హిస్టరీలోనే అద్భుతం

జెరూసలెం: ఇజ్రాయెల్ డాక్టర్లు అద్భుతం చేశారు. విరిగిన తలను అతికించి, 12 ఏండ్ల బాలుడికి ప్రాణం పోశారు. ఇది నిజంగా అత్యంత అరుదైన ఆపరేషన్ అని, మెడికల్ హిస్టరీలోనే ఇదొక అద్భుతమని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్ లోని వెస్ట్ బ్యాంక్ కు చెందిన సులేమాన్ హసన్ (12) పోయిన నెలలో సైకిల్ పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తల, మెడను కలిపే భాగంలో నరాలన్నీ కట్ అయ్యాయి. 

దాదాపు మెడ నుంచి తల వేరు అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న హసన్ ను జెరూసలెంలోని హదస్సా మెడికల్ సెంటర్ కు ఎయిర్ లిఫ్ట్ చేశారు. అక్కడి డాక్టర్లు అతని పరిస్థితి చూసి చలించిపోయారు. ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించి, ఆపరేషన్ మొదలుపెట్టారు. కొన్ని గంటల పాటు శ్రమించి విరిగిన తలను అతికించారు. బతకడు అనుకున్న బాలుడికి ప్రాణం పోశారు. ఇప్పుడతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాడు. ఆపరేషన్ పోయిన నెలలోనే చేసినప్పటికీ, హసన్ కోలుకున్న తర్వాతే డాక్టర్లు మీడియాకు వివరాలు తెలిపారు. 

అత్యాధునిక టెక్నాలజీతో.. 

ఆస్పత్రిలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండడంతోనే ఇదంతా సాధ్యమైందని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఓహాద్ ఈనావ్ తెలిపారు. ‘‘బాలుడిని బతికించేందుకు మా టీమ్ ఎంతో కష్టపడ్డది. అతడు బతికేందుకు 50 శాతమే చాన్స్ ఉండగా, మా సర్జన్లు పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. నిజంగా ఇదొక అద్భుతం. దీనికి ఆస్పత్రిలోని టెక్నాలజీతో పాటు మా అందరి మెడికల్ అనుభవం ఎంతగానో ఉపయోగపడింది” అని ఆయన చెప్పారు. ఇంత పెద్ద ఆపరేషన్ జరిగిన తర్వాత వెంటనే కోలుకోవడం చాలా కష్టమని.. కానీ హసన్ కు ఎలాంటి ఇబ్బందుల్లేవని, ఎవరి సాయం లేకుండా నడుస్తున్నాడని పేర్కొన్నారు. కాగా, తన ఒక్కగానొక్క కొడుకును బతికించినందుకు డాక్టర్లకు హసన్ తండ్రి ధన్యవాదాలు తెలిపాడు.