టిమ్స్ లో పేరుకుపోతున్న డెడ్​ బాడీలు

టిమ్స్ లో  పేరుకుపోతున్న డెడ్​ బాడీలు


హైదరాబాద్​, వెలుగు:  పేదలకు భరోసా ఇవ్వాల్సిన గచ్చిబౌలిలోని టిమ్స్ లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనాతో ట్రీట్ మెంట్ పొందుతూ రోజూ 20 నుంచి 30 మంది చనిపోతున్నారు.దీంతో అన్ని ఫ్లోర్లలో డెడ్ బాడీలు పేరుకుపోతున్నాయి. ఒక్కో స్ట్రెచర్ పై రెండు శవాలను పెడుతున్నారు. మరోవైపు పేషెంట్ల మరణవార్తను తమకు లేట్ గా చెబుతున్నారని మృతుల బంధువులు అంటున్నారు. లెక్కలు దాచేందుకే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరి డెడ్ బాడీలు రెండ్రోజులుగా హాస్పిటల్ లోనే ఉంటున్నాయి. ఒక ఫ్లోర్​ లో రెండు రోజులుగా డెడ్​ బాడీ తరలించకపోవడంతో ఐసీయూ మొత్తం వాసనతో నిండిపోయినట్లు తెలిసింది. ఆ ఫ్లోర్​లోకి ఎవరైనా వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. తమ ఫ్యామిలీ మెంబర్​ చనిపోయిన మరుసటి రోజు తమకు చెప్పారంటూ కొందరు అటెండర్లు ఆరోపించారు.  గత 10 రోజులుగా టిమ్స్​లో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అంతకు ముందు డైలీ 6 నుంచి 10 వరకు మాత్రమే చనిపోయేవారు. కానీ ప్రస్తుతం అంతకు మూడింతలు మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం 32 మంది మరణించగా, శనివారం 35 మంది వరకు మృతి చెందినట్లు తెలిసింది.

మరో గాంధీలా మారిన టిమ్స్​..

కరోనా మరణాల్లో టిమ్స్ మరో గాంధీ హాస్పిటల్​గా ​మారుతోంది. ట్రీట్​ మెంట్​ పొందుతూ మరణించినవారి డెడ్​ బాడీలను తరలించడంలో ఆలస్యం చేస్తున్నారు. అటెండర్లు అడిగితే తప్ప పేషెంట్​ ఎలాగున్నారో చెప్పడం లేదు. కొందరు తమ బంధువు ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్తే మరణవార్త చెబుతున్నారు. మరణించిన మరుసటి రోజు సమాచారం ఇస్తున్నరని కొందరు అటెండర్లు వాపోతున్నారు. దీంతో మిగతావారిలో ఆందోళన మొదలైంది. తమవాళ్ల కండిషన్​ ఎలాగుందో ఎప్పటికప్పుడు చెప్పాలని డాక్టర్ల దగ్గరకు వెళ్తున్నారు.