వ‌ల‌స కూలీల ట్రైన్: బోగీల‌తో లింక్ తెగి.. ఇంజ‌న్ వెళ్లిపోయింది

వ‌ల‌స కూలీల ట్రైన్: బోగీల‌తో లింక్ తెగి.. ఇంజ‌న్ వెళ్లిపోయింది

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది వ‌ల‌స కార్మికులు ఎక్క‌డివాళ్లు అక్క‌డ నిలిచిపోయారు. ప‌నులు లేక, ఉండ‌డానికి గూడు, తిన‌డానికి తిండి లేక ఇబ్బందులు ప‌డుతున్న వారిని స్వ‌స్థ‌లాల‌కు చేర్చేందుకు శ్రామిక్ రైళ్లు న‌డుపుతోంది భార‌త రైల్వే. ఇలా న‌డుపుతున్న ఓ రైలులో ఇవాళ ఊహించ‌ని స‌మ‌స్య త‌లెత్తింది. వంద మందికి పైగా వ‌ల‌స కూలీల‌తో ఉన్న‌ రైలు ర‌న్నింగ్ లో ఉండ‌గా.. ఇంజ‌న్ నుంచి బోగీలు విడిపోయాయి. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఆదివారం జ‌రిగింది.

వెన‌క్కి వెళ్లి.. మ‌ళ్లీ ప్ర‌యాణం షురూ

గుజ‌రాత్ లోని సూర‌త్ లో లాక్ డౌన్ కార‌ణంగా చిక్కుకుపోయిన యూపీకి చెందిన వ‌ల‌స కార్మికుల‌తో శ్రామిక్ రైలు బ‌య‌లుదేరింది. సూర‌త్ నుంచి దాదాపు 1250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప్ర‌యాగ్ రాజ్ స్టేష‌న్ కు 20 బోగీల్లో వ‌ల‌స కూలీల‌తో ట్రైన్ వెళ్తోంది. ఈ రైలు ర‌న్నింగ్ లో ఉండ‌గా దాదాపు సగం దూరం వెళ్లాక మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని జ‌బ‌ల్ పూర్ కు 30 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న భితౌని స్టేష‌న్ ద‌గ్గ‌ర ఉన్న‌ట్టుండి ఇంజ‌న్ నుంచి బోగీలు వేరుప‌డ్డాయి. దీనిని గుర్తించి.. కొంత‌దూరం వెళ్లాక మ‌ళ్లీ ఇంజ‌న్ వెన‌క్కి వ‌చ్చి కోచ్ ల‌తో ప్ర‌యాణం కొన‌సాగించింది. ఈ విష‌యాన్ని భార‌త రైల్వే ఓ ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించింది.