అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించినందుకు దళిత యువకుడి దారుణ హత్య

అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించినందుకు దళిత యువకుడి దారుణ హత్య

పూణే: అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించినందుకు దళిత యువకుడ్ని దారుణంగా చంపేసిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. విరాజ్ విలాస్ జగ్తప్ (20) అనే దళిత యువకుడు ఓ అప్పర్ క్యాస్ట్‌ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సదరు అమ్మాయి కుటుంబీకులు వారి రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడటానికి రావాల్సిందిగా విరాజ్‌కు కాల్ చేశారు. విరాజ్‌ వారి ఇంటికి చేరుకోగానే అమ్మాయి కుటుంబీకులు అతణ్ని కులం పేరుతో తీవ్రంగా తిట్టారు. అలాగే విరాజ్ అక్కడి నుంచి వెళ్లే సమయంలో అతడిపై దాడికి దిగారు. విరాజ్ తన ‌బైక్‌పై తిరిగి వెళ్తుండగా సదరు అమ్మాయి కుటుంబీకులు ఒక టెంపోలో వచ్చి అతణ్ని ఢీకొట్టారు. దీంతో కిందపడిన విరాజ్ పైకి లేవడానికి యత్నించగా.. అతణ్ని ఐరన్ రాడ్స్, రాళ్లతో కొట్టి చంపారు. తీవ్ర గాయాలపాలైన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విరాజ్‌ చివరి స్టేట్‌మెంట్‌లో పలు విషయాలను చెప్పాడు.

రోడ్డుపై గాయాలతో పడి ఉన్న సమయంలో సదరు అమ్మాయి తండ్రి జగదీశ్ కాటే తనపై దుర్మార్గంగా వ్యవహరించాడని విరాజ్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. విడిచిపెట్టమని ఎంతగా బ్రతిమిలాడినా కనికరం లేకుండా రాళ్లు, రాడ్లతో దాడి చేశారని.. తన ముఖంపై జగదీశ్ కాటే ఉమ్మి వేశాడని విరాజ్ వివరించినట్లు ఏసీపీ శ్రీధర్ జాదవ్ తెలిపారు. ‘నా కూతురును ప్రేమించడానికి నీకెంత ధైర్యం. నీది మహర్ మాంగ్ కమ్యూనిటీ. నా కూతురితో అఫైర్ నడపడానికి కావాల్సిన స్థాయి నీకు లేదు’ అని జగదీశ్ కాటే తనతో అన్నట్లు విజయ్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. విరాజ్ స్టేట్‌మెంట్ ప్రకారం పింప్రీ చించ్వాడ్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఇద్దరు మైనర్లు కావడంతో వారిని చిల్డ్రన్స్ రిమాండ్ హోమ్‌కు తరలించారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. 7 రోజుల కస్టడీ కోసం వారిని రిమాండ్‌కు తరలించారు.