హనుమకొండ/ కాజీపేట, వెలుగు: బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, 15 వేల జరిమానా విధిస్తూ హనుమకొండ ఫస్ట్ అడిషనల్ జిల్లా కోర్టు జడ్జి అపర్ణాదేవి సోమవారం తీర్పు ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం బయ్యారం చిన్నతండాకు చెందిన కుటుంబం బతుకుదెరువుకు కాజీపేట డీజిల్ కాలనీకి వలసవెళ్లింది.
వీరికి నలుగురు ఆడపిల్లలు కాగా.. చిన్న కూతురితో పర్వతగిరి మండలం అన్నారం తండాకు చెందిన వాంకుడు చంద్రుడు పరిచయం పెంచుకున్నాడు. 2022 డిసెంబర్ లో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికతో ఫొటోలు దిగి.. ఎవరికైనా చెబితే అందరికీ చూపిస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు కాజీపేట పోలీసులకు కంప్లయింట్ చేసింది.
అప్పటి సీఐ జి.మహేందర్ రెడ్డి కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. వాద ప్రతివాదనల తర్వాత నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
మరో కేసులో సిద్దిపేట సెషన్ కోర్టు తీర్పు
దుబ్బాక: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలుశిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ సిద్దిపేట ఫస్ట్అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టు జడ్జి జయ ప్రసాద్సోమవారం తీర్పు ఇచ్చారు. సీపీ అనురాధ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఎనగుర్తికి చెందిన పర్స శ్రీనివాస్ పద్నాలుగేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు 2022లో పోక్సో కేసు నమోదైంది.
అప్పటి దుబ్బాక సీఐ కృష్ణ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సోమవారం ఇరువర్గాల వాదనల తర్వాత నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
