
- వెల్లడించిన ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్
- మరణాల రేటు 50% ఉందని ఆందోళన
- ప్రభుత్వం తరఫునే ట్రీట్మెంట్ ఇప్పించేందుకు కసరత్తులు
ముంబై/బెంగళూరు: కరోనా పేషెంట్లను బ్లాక్‌ఫంగస్ కమ్మేస్తోంది. దేశమంతటా ఆ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 2 వేలకుపైగా బ్లాక్‌ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) కేసులున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. కరోనా కేసులు ఎక్కువయ్యే కొద్దీ బ్లాక్‌ఫంగస్ బాధితులూ పెరిగే ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలకు అటాచ్ చేసిన దవాఖాన్లలో బ్లాక్‌ఫంగస్ బాధితులకు ట్రీట్మెంట్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
మరణాల రేటు ఎక్కువ
బ్లాక్‌ఫంగస్ సోకిన వాళ్లలో మరణాల రేటు 50% దాకా ఉందని తోపే చెప్పారు. బాధితులను ఈఎన్టీ, కంటి డాక్టర్లు, న్యూరాలజిస్టులు ఇతర విభాగాల నిపుణులు చెక్ చేయాలన్నారు. మహాత్మా ఫూలే జన ఆరోగ్య యోజన కింద బ్లాక్‌ఫంగస్ బాధితులకు ట్రీట్మెంట్ చేయించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ట్రీట్మెంట్లో వాడే ‘యాంఫోటెర్సిన్ బీ’ వంటి మందులకు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రైసింగ్ అథారిటీకి లేఖ రాస్తామని చెప్పారు. ముంబైలోని హాఫ్కిన్ అనే కంపెనీ లక్ష యాంఫోటెర్సిన్ బీ ఇంజెక్షన్ల తయారీకి టెండర్లను పిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఒక్క నెలలోనే 60 దాకా బ్లాక్‌ఫంగస్ కేసులు వచ్చాయి. ఆరుగురు చనిపోయారు. బ్లాక్‌ఫంగస్ కేసులపై కర్నాటక అలర్ట్ అయింది. దేశంలో దాని బారిన పడిన కరోనా బాధితుల వివరాలను ఇవ్వాల్సిందిగా నిపుణులను ఆదేశించినట్టు ప్రభుత్వం పేర్కొంది.