క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు పూర్తి

క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు పూర్తి

క్వీన్ ఎలిజబెత్ -2 అంత్యక్రియలు ముగిశాయి. రాజ కుటుంబం సంప్రదాయాల ప్రకారం రాణికి తుది వీడ్కోలు పలికారు. రాజకుటుంబ సభ్యుల సమక్షంలో సెయింట్ జార్జ్ చాపెల్‌ లోపల ఉన్న కింగ్ జార్జ్ 6 మెమోరియల్ చాపెల్‌లో తన భర్త, ప్రిన్స్ ఫిలిప్ సమాధి పక్కన క్వీన్ ఎలిజబెత్ 2ను ఖననం చేశారు. ఆమె అంత్యక్రియలకు 2000 మంది హాజరయ్యారు. లక్షల మంది ప్రజలు లండన్ వీధుల్లోకి వచ్చి క్వీన్ కు వీడ్కోలు పలికారు. అంతిమ యాత్ర చూసేందుకు జనం లండన్ వీధుల్లో బారులు తీరారు. క్వీన్ అంత్యక్రియలకు వివిధ దేశాలకు చెందిన రాజ కుటుంబీకులు, ప్రపంచ దేశాల నాయకులు హాజరయ్యారు.96 ఏండ్ల క్వీన్ ఎలిజబెత్ ఈ నెల 8న స్కాట్లాండ్లో కన్నుమూయగా 11 రోజుల అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. 

ప్రిన్స్ ఫిలిప్ సమాధి పక్కన
2,868 వజ్రాలు, 17 నీలమణులు, 11 పచ్చలు, 269 ముత్యాలు, 4 కెంపులతో కూడిన కిరీటాన్ని క్వీన్  శవపేటికపై అలంకరించారు. తొలుత వెస్ట్ మినిస్టర్  హాల్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబే వరకు క్వీన్ అంతిమయాత్ర  సాగింది. అక్కడ ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వెల్లింగ్టన్ అర్చి వరకూ యాత్ర కొనసాగింది. అక్కడి నుంచి విండ్సర్స్  క్యాజిల్లోని సెయింట్ జార్జ్  చాపెల్కు రాణి శవపేటికను తీసుకెళ్లారు. కింగ్  జార్జ్  6 మెమోరియల్ చాపెల్లోకి తీసుకెళ్లిన తర్వాత చివరగా రాయల్ వాల్ట్ లో క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్  ఫిలిప్ సమాధి పక్కనే రాణిని ఖననం చేశారు. అంత్యక్రియలు పూర్తైన అనంతరం అక్కడున్న వారంతా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. 

భారత్ తరఫున రాష్ట్రపతి ముర్ము 
భారత్ తరఫున క్వీన్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. వెస్ట్ మినిస్టర్  హాల్లో ఉంచిన ఎలిజబెత్ -2 పార్థివదేహానికి ముర్ము నివాళులర్పించారు. అంతకు ముందు లాంకస్టెర్  హౌస్లో రాణి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన సంతాప సందేశ పుస్తకంలో రాష్ట్రపతి ముర్ము సంతకం చేశారు. పలు దేశాధినేతలు సహా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 800 మంది అతిథులు సెయింట్  చాపెల్ లోని విండ్సర్ క్యాజిల్  దగ్గర నివాళులర్పించారు. 

బ్రిటన్ లో ప్రత్యక్ష ప్రసారం
క్వీన్ అంత్యక్రియలను 125 సినిమా థియేటర్లతో పాటు లండన్ సహా బ్రిటన్వ్యాప్తంగా పార్కులు, వివిధ ప్రదేశాల్లో భారీ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంత్యక్రియలకు AJ ప్లస్ అనే మీడియా 9  మిలియన్ డాలర్లు ఖర్చుచేసింది.