Prajwal Revanna :అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై 2వేల పేజీల ఛార్జ్‌షీట్

Prajwal Revanna :అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై 2వేల పేజీల ఛార్జ్‌షీట్

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌పై సెక్స్ స్కాండల్ కేసులో నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైయ్యాయి. ఈ కేసులో 150 మంది సాక్ష్యులను విచారించిన స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ 2,144 పేజీల ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేసిందని శనివారం సిట్ తెలిపింది. ఈ కేసులో మొత్తం 56 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. వీరిలో నలుగు బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని బసవనగుడి నివాసంలో ప్రజ్వల్ మహిళపై అత్యాచారం చేసినట్లు అభియోగాలు మోపారు. మే 31న ప్రజ్వల్ రేవణ్ణ ని అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

ఇంట్లో ప‌నిమ‌నిషిపై లైంగిక దాడి జ‌రిగిన‌ట్లు న‌మోదు చేసిన కేసులో ఛార్జీషీట్ ను సిట్ స‌మ‌ర్పించింది. స్పాట్ ఇన్‌స్పెక్షన్‌, బ‌యోలాజిక‌ల్‌, ఫిజిక‌ల్‌, సైంటిఫిక్‌, మొబైల్‌, డిజిట‌ల్‌, ఇత‌ర ఆధారాల‌ను సేక‌రించిన‌ట్లు సిట్ తెలిపింది. ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేయ‌డానికి ముందు నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నట్లు కూడా సిట్ వెల్లడించింది. దాదాపు 3,000 వీడియో క్లిప్‌లు విశ్లేషించడానికి SIT అనేక ఫోరెన్సిక్ పద్ధతులను ఉపయోగించింది. 

ప్రజ్వల్ 31 మే 2024 నుంచి సిట్ కస్టడీలో ఉన్నాడు. జూన్ 18 న జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. 2019  నుంచి 2021 మధ్య కాలంలో ప్రజ్వల్ హాసన్ ఎంపీగా ఉన్న టైంలో ఈ నేరాలు జరిగాయని సిట్ వారి విచారణలో గుర్తించింది. బాధితులు ఎక్కువగా హాసన్‌కు చెందిన వారే లేదా బెంగళూరులో దాడికి గురైనప్పటికీ ఆ జిల్లాకు సంబంధించిన వారు.