రుణమాఫీకి 20వేల కోట్లిస్తమని.. వేయి కోట్లే ఇచ్చిండు: అర్వింద్

రుణమాఫీకి 20వేల కోట్లిస్తమని.. వేయి కోట్లే ఇచ్చిండు: అర్వింద్
  • ఊర్లలో 6 నుంచి 10 గంటలు కరెంట్ కట్ 
  • కరెంట్​ కొనుగోళ్లలో భారీ స్కామ్​ జరిగిందని ఆరోపణ
  • రుణమాఫీకి 20వేల కోట్లిస్తమని.. వేయి కోట్లే ఇచ్చిండు: అర్వింద్

న్యూఢిల్లీ, వెలుగు: రైతులను కూలీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ 2014, 2018 మేనిఫెస్టోలలో పేర్కొందని గుర్తు చేశారు. ఇందుకోసం రూ.21 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించినట్టు చెప్పారన్నారు. కానీ, ఇప్పటిదాకా రూ.1,171 కోట్లు మాత్రమే విడుదల చేశారని వివరించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రుణమాఫీ మాటలు నమ్మిన రైతులు అప్పులు చేశారన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కోసం 2020 వరకు నయా పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు రాష్ట్ర సర్కార్ వాటా డబ్బులు కట్టడం లేదని చెప్పారు. దీంతో బీమా ఫలాలు రైతులకు అందడం లేదన్నారు. ఫారెస్ట్ అధికారి హత్యను అడ్డంపెట్టి పోడు భూముల సర్వే మొత్తం నిలిపేశారని ఆరోపించారు. రాష్ట్రంలో వలసలు పెరిగాయాని, ఎన్నారైలకు కేసీఆర్ సర్కార్ చేసింది శూన్యం అని అన్నారు.

కేరళ టూర్​ స్టడీ కోసం కాదు!

టీఆర్ఎస్ నేతలు, అధికారుల కేరళ టూర్ స్టడీ కోసం కాదని, వాళ్లు సంపాదించుకున్న డబ్బులు ఎక్కడ దాచాలో తెలుసుకోవడం కోసం వెళ్లారని అర్వింద్ విమర్శించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఉన్న విజయ్ నాయర్ ఇదే విషయాన్ని చెప్పారేమో అని అన్నారు. తెలంగాణ ఫారిన్ మినిస్టర్ అని గూగుల్ చేస్తే కేటీఆర్ ఫొటో వస్తోందని చెప్పారు.

కరెంటు కోతలు విధిస్తున్నరు

24 గంటల కరెంటు ఇస్తున్నామని సర్కార్ చెబుతున్నా... గ్రామాల్లో 6 నుంచి 10 గంటల కోతలు విధిస్తున్నారని అర్వింద్ అన్నారు. అప్పులు చేసి విద్యుత్ కొంటుందని, ఈ కొనుగోళ్లలో భారీ కుంభకోణం దాగి ఉందన్నారు. ఈ కుంభకోణంలోని డబ్బులనే.. ఢిల్లీ లిక్కర్ స్కాం, ఫీనిక్స్ లలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు.  తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై తనతో పాటూ వివేక్ వెంకటస్వామి, ప్రకాశ్ రెడ్డి, అజ్మీరా బాబీలతో బీజేపీ కమిటీ వేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను సైంటిఫిక్​గా స్టడీ చేస్తున్నామని, ఇది టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌పై చార్జిషీట్ దాఖలు చేయడానికి కీలక నివేదిక అని తెలిపారు.