ఈసారి రైతు బంధు అందేది ఎందరికో..

ఈసారి రైతు బంధు అందేది ఎందరికో..
  • అర్హులు 2,66,676 మంది.. 
  • ఇచ్చేది రూ. 304,49 కోట్లు

యాదాద్రి, వెలుగు :  ప్రతి సీజన్​ మాదిరిగానే వానాకాలం– 2023 సీజన్​లోనూ యాదాద్రి జిల్లాలో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. గత యాసంగి సీజన్​లో 2,61,052 మంది లబ్ధిదారులు ఉండగా ఈసారి మరో 5,624 మంది పెరిగి 2,66,676 మందికి చేరింది. ఈ ఏడాది  జూన్​ 18 నాటికి పట్టాదారు పాస్​బుక్స్​ పొందిన రైతులు పాస్​బుక్స్​, ఆధార్​ జిరాక్స్​తో పాటు  బ్యాంక్​ అకౌంట్​ నెంబర్​, ఐఎఫ్ఎస్సీ కోడ్ నంబరు అగ్రికల్చర్​ ఆఫీసర్లకు అందించాల్సి ఉంటుంది. 

రైతుబంధుకు అర్హులైన రైతులకు  పెట్టుబడి సాయంగా రూ.304,49,66,386 అందిస్తామని ఆఫీసర్లు తెలిపారు. అయితే కొత్తగా పాస్​బుక్స్​ పొందిన వారు 5,624 మంది అయితే ఆఫీసర్లు మాత్రం 12,666 మంది పొందినట్టుగా ప్రకటన విడుదల చేశారు. 2022–23 యాసంగి సీజన్​ రైతుబంధు నాటికి పాస్​బుక్స్​ పొందిన 7,042 అకౌంట్లలో సర్కారు డబ్బు జమ చేయలేదు. అందుకే వారిని ఈ సీజన్​లోనే పాస్​బుక్స్​ పొందినట్టుగా ప్రకటనలో పేర్కొన్నారు. 

అందరికీ అందని  రైతు బంధు

2018 ముందస్తు ఎన్నికల ముందు ప్రభుత్వం రైతుబంధు స్కీం ప్రారంభించింది. మొదట్లో ఎకరానికి రూ. 4 వేలు ఇస్తామని చెప్పిన సర్కారు.. ఆ తర్వాత ఎకరానికి రూ. 5 వేలు చేసింది. 2018 రెండు సీజన్లలో ఎకరాలతో సంబంధం లేకుండా చిన్నాపెద్ద రైతులందరి ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్​ కనిపిస్తోంది. ప్రతి సీజన్లోనూ సీసీఎల్​ఏ నుంచి వచ్చిన లిస్టులో రైతుల సంఖ్య పెరుగుతోంది. కానీ అదే స్థాయిలో ప్రతి సీజన్​లో 20 వేల నుంచి 30 వేల మంది రైతు ఖాతాల్లో రైతుబంధు జమ కావడం లేదు. 

గడిచిన యాసంగి సీజన్​లో కొత్తగా పాస్​బుక్స్​ పొందిన వారితో పాటు 10 నుంచి 15 ఎకరాలు కలిగిన దాదాపు 30 వేల ఖాతాల్లో  రైతుబంధు సొమ్ము జమకాలేదు. ఈ వానాకాలం సీజన్​లో 2,66,676 మంది రైతుబంధుకు అర్హులుగా ప్రకటించినా అందులో ఎంతమందికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా 2018 వానాకాలం సీజన్​ నుంచి 2022–23 యాసంగి సీజన్​ నాటికి 21,35,088 ఖాతాల్లో రూ. 2,758.53 కోట్లు  జమ కావాల్సి ఉండగా 19,50,268 ఖాతాల్లో రూ. 2,483.53 కోట్లు జమ అయింది. మరో 1,84,320 ఖాతాల్లో రూ. 327.47 కోట్లు జమ కాకుండా కోత పడింది.