జూన్15 నుంచి స్కూళ్లు స్టార్ట్.. వరుస సెలవుల నేపథ్యంలో పొడిగింపు..అకడమిక్ క్యాలెండర్ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన విద్యాశాఖ

జూన్15 నుంచి స్కూళ్లు స్టార్ట్.. వరుస సెలవుల నేపథ్యంలో పొడిగింపు..అకడమిక్ క్యాలెండర్ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన విద్యాశాఖ
  • ఈ విద్యాసంవత్సరం  227 వర్కింగ్ డేస్
  • వచ్చే ఏడాది ఏప్రిల్ 23 లాస్ట్ వర్కింగ్ డే
  • దసరా సెలవులు 13 రోజులు, సంక్రాంతికి 5 రోజులు
  • మార్చిలో పదో తరగతి పరీక్షలు
  • అకడమిక్ క్యాలెండర్ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన విద్యాశాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లకు 2026–-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 227 వర్కింగ్ డేస్ ఉండనున్నాయి. 2027 ఏప్రిల్ 23వ తేదీని విద్యాసంవత్సరపు చివరి పనిదినంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ముందే ఖరారైన పండుగ సెలవులు


విద్యార్థులకు పండుగ సెలవుల షెడ్యూల్‌‌ను విద్యాశాఖ ముందుగానే ఖరారు చేసింది. దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 22 వరకు 13 రోజుల పాటు ఉండనున్నాయి. సంక్రాంతి సెలవులు  వచ్చే 2027 జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు ఇవ్వనున్నారు. మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఉంటాయి. 2027 ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు సమ్మర్ హాలిడేస్ కొనసాగుతాయి. 

పరీక్షల షెడ్యూల్ ఇదే..

వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి పరీక్షల తేదీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. 2027 మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జనవరి 10 నాటికే టెన్త్ సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించింది. 2027 ఫిబ్రవరి 28 లోపు ప్రీఫైనల్ పరీక్షలు పూర్తి చేయాలని సూచించింది. ఎస్ఏ-2 (1 నుంచి 9 తరగతులు) 2027 ఏప్రిల్ 9 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. ఎఫ్ఏ–1 పరీక్ష జూలై 31 లోపు, ఎఫ్ఏ–2 సెప్టెంబర్‌‌ 21 లోపు, ఎస్‌‌ఏ–1 పరీక్ష అక్టోబర్‌‌ 1 నుంచి 9 వరకు నిర్వహించాల్సి ఉంటుంది.

నెలకోసారి ‘నో బ్యాగ్‌‌ డే’

ప్రతి నెలా మూడో శనివారాన్ని 'నో బ్యాగ్‌‌ డే'గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు విద్యార్థులు పుస్తకాల సంచి లేకుండా బడికి రావచ్చు. అలాగే, ప్రతిరోజూ ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులతో 5 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలని విద్యాశాఖ ఆదేశించింది. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ.. క్రీడల షెడ్యూల్‌‌ను కూడా విడుదల చేసింది. స్కూల్‌‌ టైమింగ్స్‌‌ విషయానికొస్తే.. హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు పనిచేస్తాయి. జంట నగరాల్లో మాత్రం ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి.

12 నుంచి 15కు మారిన రీఓపెన్.. 

తొలుత ఈ నెల 12న స్కూళ్లు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వరుస సెలవులు వస్తూండటంతో15న స్కూళ్లు రీఓపెన్ చేయనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాలి. అయితే ఆ తర్వాతి రోజు జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం సెలవు దినాలు కావడంతో.. స్కూళ్లను 15వ తేదీ నుంచి ప్రారంభించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు జూన్ 15 నుంచి పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. జులై 11న రెండో శనివారాన్ని సాధారణ పనిదినంగా ప్రకటించింది.