- ఎన్నికల టైం కావడంతో పెరిగిన కూంబింగ్
- ఎండాకాలంలో పల్చబడిన అడవి
- మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా
భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు: ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఎండలు మావోయిస్టులకు ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్, తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని దండకారణ్యం బుల్లెట్ల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య కొన్ని రోజులుగా తుపాకుల మోత మోగుతోంది. మూడు వారాల్లోనే ఎన్‌కౌంటర్లలో 21 మంది మావోయిస్టులు చనిపోయారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని అటవీ ప్రాంతాల ప్రజలు భయంభయంగా బతుకున్నారు.
ఎన్నికల నేపథ్యంలో అలర్ట్ అయిన బలగాలు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే దండకారణ్యంలో పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్న బలగాలు ఎన్నికల నేపథ్యంలో మరింత అప్రమత్తం అయ్యారు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా కేంద్ర బలగాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పోలీసులు కూంబింగ్ చేపడుతున్నారు. ఇన్‌ఫార్మర్, నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. ఎప్పటికప్పుడు మావోయిస్టుల కదలికలను తెలుసుకుంటున్నారు. మూడు వారాల్లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో 21 మంది మావోయిస్టులు హతమయ్యారు. గత నెలన్నర కాలంలో తెలంగాణ –- ఛత్తీస్‌గఢ్, తెలంగాణ – మహారాష్ట్ర అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో సుమారు 40 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు.
ఎండాకాలంలో స్థావరాలకు ఇబ్బందులు
ఎండాకాలం వచ్చిందంటే మావోయిస్టులకు గుబులు మొదలవుతోంది. ఈ టైంలో చెట్ల ఆకులు రాలిపోతుండడంతో అడవి పల్చగా కనపడుతుంది. దీంతో మావోయిస్టుల స్థావరాల ఏర్పాటుకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. బలగాలు, పోలీసులు డ్రోన్ల సాయంతో అడవిని జల్లెడ పడుతూ మావోయిస్టుల కదలికలపై నిఘా పెడుతున్నారు.
అచ్చిరాని శాంతి చర్చలు
మావోయిస్టులకు శాంతి చర్చలు కలిసి రావడం లేదు. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించారు. చర్చల పేరుతో తమకు వెసులుబాటు లభించిందని మావోయిస్టులు భావించారు. అయితే ఆ వెసులుబాటే వారి కొంప ముంచింది. చర్చలు విఫలం కావడంతో అడవి నుంచి మావోయిస్టుల రాకను గమనించిన పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలతో చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్లలో ముఖ్య నాయకులు చనిపోవడంతో మిగిలిన వారు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం బాట పట్టారు. అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మావోయిస్టులతో చర్చలకు సిద్ధమని గత నెలలో ఛత్తీస్‌గఢ్ సీఎం ప్రకటించారు. తమ డిమాండ్లను అంగీకరిస్తే తాము చర్చలకు వస్తామని ప్రకటించిన నెల రోజుల్లోనే జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు.
క్షణక్షణం భయం భయంగా..
లోక్ సభ ఎన్నికల టైం కావడంతో అటవీ ప్రాంతాన్ని కేంద్ర బలగాలు, గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రధానంగా తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని సరిహద్దు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపూర్ సమీపంలోని కర్రె గుట్టలు, పాలెంవాగు ప్రాజెక్ట్ వద్ద శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.
బీజాపూర్ జిల్లా కొర్చోలి అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. మహారాష్ట్ర – సరిహద్దు అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో పలువురు మావోలు చనిపోయారు. ఎన్‌కౌంటర్లకు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు నేతలు ప్రకటనలు జారీ చేస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో ఎక్కడ తుపాకులు పేలుతాయోనని భయంభయంగా గడుపుతున్నారు.