హైదరాబాద్, వెలుగు: నగరంలోని జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కిందటి ఆర్థిక సంవత్సరంలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ బాగా పెరిగింది. 2022–-23లో విమానాశ్రయం నుంచి 2.1 కోట్ల మందికిపైగా ప్రయాణించారు. వీరిలో 1.76 కోట్ల మంది దేశీయ ప్రయాణీకులు కాగా, 34 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణీకులు ఉన్నారు. వచ్చిపోయిన విమానాల సంఖ్య (ఏటీఎం) 1,60,597 వరకు ఉంది. వీటిలో 1,37,640 దేశీయ ఏటీఎంలు, 22,957 అంతర్జాతీయ ఏటీఎంలు ఉన్నాయి. కరోనాకు ముందు (2019–20) లెక్కలతో పోలిస్తే, 2022–23లో ప్రయాణీకుల రద్దీ 97 శాతానికిపైగా రికవరీ అయింది.
ఇదే సంవత్సరంలో ట్రాన్స్‌ఫర్ ట్రాఫిక్ 13శాతం నుండి 22 శాతానికి పెరిగింది. ఎంఎన్‌సీలు, కార్పొరేట్లు, వీఎఫ్ఆర్ (విజిటింగ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్), పర్యాటకులు, ఎంఎస్ఎంఈలు, స్టూడెంట్ల రద్దీ ఎక్కువగా ఉంది. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో హైదరాబాద్ ఆరోస్థానంలో ఉంది. కరోనా అనంతరం 2022–-23లో హైదరాబాద్ విమానాశ్రయం నుండి 3 కొత్త దేశీయ నగరాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కోవిడ్‌కు ముందు హైదరాబాద్ నుంచి 55 దేశీయ గమ్యస్థానాలు ఉండగా, ఇప్పుడు అవి 70కు చేరాయి. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి సింగపూర్, ఖతార్, షార్జా, దోహా, కువైట్ వంటి మునుపటి గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్-–కొలంబో విమాన సర్వీసులను పునరుద్ధరించారు. సింగపూర్‌కు వైడ్-బాడీ సర్వీస్ నడుస్తోంది. ఢాకా, బాగ్దాద్, డాన్ ముయాంగ్‌కూ సర్వీసులు ప్రారంభమయ్యాయి. రద్దీని తట్టుకోవడానికి విమానాశ్రయ సామర్థ్యాన్ని ప్రస్తుత సంవత్సరానికి 12 మిలియన్ ప్రయాణీకుల నుంచి 34 మిలియన్ ప్రయాణీకులకు పెంచుతున్నారు.
