TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..2.1 శాతం డీఏ పెంపు

TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..2.1 శాతం డీఏ పెంపు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు  ప్రభుత్వం  గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు  2.1 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనితో ప్రస్తుతం ఉన్న 50.7 శాతం డీఏ, 52.8 శాతానికి చేరింది. 

పెరిగిన ఈ డీఏ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. గత మూడు నెలలకు సంబంధించిన బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది.  ఈ పెంపు వల్ల ఆర్టీసీపై ప్రతి నెలా రూ. 2.82 కోట్ల  అదనపు భారం పడనుంది. గతంలో జూలై 2025లో కూడా ప్రభుత్వం 2.1 శాతం డీఏను పెంచిన సంగతి తెలిసిందే. మే 2024లో RPS-2017 అమలు చేసినప్పటి నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలేవీ పెండింగ్‌లో లేవని ఈ సందర్భంగా పొన్నం  స్పష్టం చేశారు.

డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో  పలు  రీజియన్ల ఆర్ఎంలతో (RM) మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థలో పెండింగ్‌లో ఉన్న పనులు , అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి నుంచి  ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,  కార్మికుల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని  పొన్నం స్పష్టం చేశారు.

కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆసుపత్రుల అప్గ్రెడేషన్..  కారుణ్య నియామకాలు. కొత్త రిక్రూట్‌మెంట్ల ద్వారా పని భారం తగ్గింపు.. దీర్ఘకాలంగా విధులకు దూరమైన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం.   కొత్త బస్సుల కొనుగోలుతో సంస్థను ఆధునీకరించడం.  ఇలా అనేక కార్యక్రమాలతో ఆర్టీసీని గాడిలో పెడుతున్నామని ఆయన వివరించారు.  తెలంగాణకు లైఫ్ లైన్‌గా ఉన్న ఆర్టీసీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.