హైదరాబాద్, వెలుగు: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఉద్యోగ, టీచర్లు సామూహిక సెలవుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల మంది సీపీఎస్ ఎంప్లాయీస్సెలవు పాటించి, జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 2.60 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల్లో అత్యవసర సేవలకు చెందిన 45 వేల మందికి మినహాయింపు ఇచ్చామని, మిగిలిన వారిలో ఇప్పటికే 1.50 లక్షల మందికి పైగా సెలవు దరఖాస్తులు సమర్పించారని సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ తెలిపారు.
ఈ ఉద్యమానికి టీచర్ల సంఘాలు, ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఓపీఎస్ హామీని సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. వెంటనే కమిటీని ఏర్పాటు చేసి, సీపీఎస్ రద్దుకు కాలపరిమితి ప్రకటించాలని కోరారు. సీపీఎస్‌లో ఉద్యోగుల జీతాల నుంచి 11.5 శాతం కోత విధిస్తున్నా, రిటైర్ అయిన వారికి తగిన పెన్షన్ అందడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలు ఉద్యమాల ద్వారా డీసీఆర్‌జీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నామని గుర్తుచేశారు. నవంబర్ 17న చేపట్టనున్న సామూహిక సెలవు కేవలం ఒక్కరోజు నిరసన కాదని, భవిష్యత్ తరాల సామాజిక భద్రత కోసం చేస్తున్న పోరాటమని స్పష్టం చేశారు.
