22 మందికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా ప్రమోషన్

22 మందికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా ప్రమోషన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్​ఎంసీలో 2024–25 సంవత్సరానికి గానూ 22 మంది సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు(ఏఎంసీ)గా పదోన్నతి కల్పిస్తూ  ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలంబరితి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో జీహెచ్‌‌‌‌ఎంసీలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న కీలక ఏఎంసీ పోస్టులు భర్తీ కానున్నాయి. పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది జులై 29న డిపార్ట్‌‌‌‌మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) సమావేశమైంది. ఈ కమిటీ జీహెచ్‌‌‌‌ఎంసీలోని సూపరింటెండెంట్ల సీనియారిటీ, సర్వీస్ నిబంధనలు, వారి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించింది.

అన్ని అర్హతలను పరిగణనలోకి తీసుకుని, 22 మందిని ఏఎంసీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన ప్రభుత్వం, తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన ఉద్యోగులు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా వారికి కేటాయించిన కొత్త పోస్టుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా విధుల్లో చేరకుంటే పదోన్నతి రద్దవుతుందని ఉత్తర్వుల్లో హెచ్చరించింది. ఈ పదోన్నతులు కోర్టులు, ట్రిబ్యునళ్లలో పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసుల తుది తీర్పులకు లోబడి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, పదోన్నతి పొందిన వారిలో సూపరింటెండెంట్ బి.స్వామి గురువారం రిటైర్డ్​ అయ్యారు.