జమ్మూలో లోయలో పడ్డ బస్సు.. 22 మంది మృతి

జమ్మూలో లోయలో పడ్డ బస్సు.. 22 మంది మృతి
  • మరో 57 మందికి తీవ్ర గాయాలు 

జమ్మూ: దైవ దర్శనం కోసం వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడడంతో 22 మంది మరణించగా, 57 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 80 మంది భక్తులు హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతం నుంచి జమ్మూకాశ్మీర్ రియాసి జిల్లాలోని శివ్ ఖోరి గుడికి వెళ్తున్నారు.  గురువారం మధ్యాహ్నం జమ్మూ జిల్లాలోని చోకిచోరా బెల్ట్​లోని తుంగీమోర్ ప్రాంతానికి చేరుకోగానే బస్సు అదుపు తప్పి 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారికి చికిత్సను అందించేందుకు సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. కాగా, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తుల్లో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందినవారని చెప్పారు.