షిండే వర్గంలో త్వరలో తిరుగుబాటు.. బీజేపీపై ఎమ్మెల్యేల అసంతృప్తి!

షిండే వర్గంలో త్వరలో తిరుగుబాటు.. బీజేపీపై ఎమ్మెల్యేల అసంతృప్తి!
  • షిండే వర్గంలో త్వరలో తిరుగుబాటు
  • బీజేపీని వీడేందుకు 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు సిద్ధం
  • ఉద్ధవ్ థాక్రే వర్గం సొంత పత్రిక సామ్నా కథనంలో వెల్లడి

 

ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ షిండే వర్గంలో త్వరలో తిరుగుబాటు జరుగుతుందని శివసేన(యూబీటీ–ఉద్ధవ్ థాక్రే వర్గం) అధికారిక పత్రిక సామ్నా పేర్కొంది. షిండే వర్గంపై బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, ఈ కారణంగా 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు బీజేపీని, షిండే వర్గాన్ని వీడేందుకు రెడీ అవుతున్నారని మంగళవారం వెల్లడించింది. తమ పార్టీ పట్ల బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ షిండే వర్గం ఎంపీ గజానన్ కీర్తికార్ ఇటీవల చేసిన కామెంట్లే అందుకు నిదర్శనం అని పేర్కొంది. 

వాళ్లంతా బీజేపీ ఆధీనంలోని కోళ్లు

షిండే వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ ఆధీనంలో ఉన్న కోళ్లు, కోడిగుడ్లతో సామ్నా పోల్చింది. వాటిని బీజేపీ ఎప్పుడు వధిస్తుందో చెప్పలేమని కామెంట్ చేసింది. బీజేపీ చేష్టలు భరించలేక, తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేకే 2019లో ఉద్ధవ్ థాక్రే నేతృ త్వంలోని శివసేన బీజేపీకి గుడ్​బై చెప్పిందని గుర్తుచేసింది. థాక్రేలకు వెన్నుపోటు పొడిచి షిండే నేతృత్వంలో బీజేపీతో జట్టు కట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు అసలు సంగతి ఇప్పుడు అర్థమవుతోందంది. ఏడాది గడవకముందే వాళ్ల ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందని, విడాకులపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. సీఎం షిండేకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డ్రైవర్​గా మారారని, అధికారాల స్టీరింగ్ ఆయనే చేతుల్లోనే ఉందని సామ్నా విమర్శించింది.