సిబ్బంది లేక మూలనపడ్డ 22 వెంటిలేటర్లు

V6 Velugu Posted on Apr 28, 2021

  • కరోనా కేసులు పెరిగి వెంటిలేటర్లకు కొరత
  • సిబ్బంది లేరని ఉన్నవాటిని మూలనపడేసిన వైనం
  • సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో పనిచేయని వెంటిలేటర్లు

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి పరిస్థితి. కేంద్రం వెంటిలేటర్లు ఇచ్చినా ఏడాది కాలంగా వాడుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉంది. కార్పొరేట్ ఖర్చు బరించలేని పేదలకు దిక్కైన జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కనీస వైద్యం కరువై.. ఎంతో మంది కరోనా రోగుల మరణాలకు నిలయంగా మారుతోంది.

శరీరంలోకి చేరిన కరోనా మహమ్మారి ఊపిరి ఆడనివ్వకుండా మృత్యుముఖంలోకి తీసుకెళ్తున్న సమయంలో వెంటిలేటర్లే సంజీవనిలు. ఐసీయూ బెడ్, వెంటిలేటర్ల కోసం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని.. ప్రతి రోజు వందలాది మంది జిల్లా ఆసుపత్రికి వస్తున్నారు. వెంటిలేటర్ సదుపాయం ఉన్నా.. వాటిని వాడకపోవడంతో ఆస్పత్రి ముందే ప్రాణాలు వదులుతున్న సంఘటనలు ఇక్కడ నిత్యకృత్యం అవుతున్నాయి. గత సంవత్సరం జూన్‌లో సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి 20 వెంటిలేటర్లు వచ్చాయి. అప్పటికే అందుబాటులో ఉన్న రెండు వెంటిలేటర్లతో కలిపి మొత్తం సామర్థ్యం 22కు చేరింది. వీటి ద్వారా ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉన్నవాళ్ల ప్రాణాలు నిలబెట్టొచ్చు. కానీ, సిబ్బంది లేరన్న కారణంతో వీటిని మూలన పడేశారు. దాంతో పరిస్థితి విషమించిన రోగులను గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. గాంధీలో పరిస్థితిని అంచనా వేసి కొంతమంది పేషంట్లు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వెంటిలేటర్లు అంతంత మాత్రంగా ఉండటంతో వీటికి వీపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వెంటిలేటర్ దొరికినా ఒక్కో రోజుకు 50వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు పేద, మధ్యతరగతి వారు అప్పులు చేసి మరి ప్రైవేటు ఆస్పత్రులకు డబ్బులు ధారపోస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మాత్రం వెంటిలేటర్లను వాడకుండా నిర్లక్ష్యంగా ఓ మూలన పడేయడం జిల్లా యంత్రాంగ నిర్లక్ష్య వైఖరిని తేటతెల్లం చేస్తోంది. సిబ్బంది లేరనే ఒకే ఒక్క సాకుతో వాటిని నిరుపయోగంగా మూలన పడేశారు. ఇదే విషయమై సంబంధిత అధికారులను అడిగితే... వాటిని వాడాలనే ఆలోచన కూడా లేనట్లు మాట్లాడుతున్నారు. వీటిని వినియోగంలోకి తేవాలంటే ముందు సిబ్బందిని నియమించాలి. గతంలోనూ ఐసీయూలో పనిచేసేందుకు వీలుగా అయిదుగురు మత్తుమందు వైద్యనిపుణులతో పాటు సుశిక్షితులైన సిబ్బందిని నియమించారు. వారికి జాతీయ ఆరోగ్య మిషన్‌ నుంచి వేతనాలు కూడా అందిస్తున్నారు. వారి సేవలనూ సద్వినియోగం చేసుకోవడం లేదు.  ఒక్కో వెంటిలేటర్‌ పనిచేయాలంటే వైద్యుడితో పాటు దాదాపు 8 మంది వరకు ట్రెయిన్డ్ ఎంప్లాయిస్ కావాలంటున్నారు. వెంటిలేటర్‌ అవసరంతో ఎవరైనా వస్తే అత్యవసరంగా ఒకటి రెండు గంటల పాటు  ఆస్సత్రిలో ఉంచుకోని ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఏది ఏమైనా.. ఆస్పత్రిలో వసతులు ఉన్నా వాడుకోకుండా మూలనపడేసిన జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై అధికారులతో చర్చించి వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకొస్తే జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని వారంటున్నారు.

Tagged Telangana, ventilators, , staff shortage in sangareddy hospital, Sangareddy District Hospital.

Latest Videos

Subscribe Now

More News