
టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) కథానాయకుడిగా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ( Goutham Tinnanuri ) తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా మూవీ 'కింగ్‌డమ్' ( Kingdom ) . ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది . భాగ్యశ్రీ బోర్సే ( Bhagyashree Borse ) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా, చిత్ర బృందం తాజాగా 'అన్నా అంటూనే' సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
విజయ్ దేవరకొండ బ్రదర్స్‌గా సత్యదేవ్ ( Satya Dev ) నటిస్తున్నారు. 'అన్నా అంటూనే' సాగే ఈ గీతం అన్నాదమ్ముల అనుబంధం నేపథ్యంతో సాగుతుంది. మానవ సంబంధాల్లోని లోతైన భావోద్వేగాలను స్పృశించేలా కృష్ణకాంత్ ఈ పాటను అత్యద్భుతంగా రాశారు. ఈ పాటను సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ( Anirudh Ravichander) ఆలపించడమే కాకుండా, ఆయనే స్వరాలు సమకూర్చారు. అనిరుధ్ తనదైన శైలిలో అందించిన బాణీలు, గానం ఈ పాటకు ప్రాణం పోశాయి. ప్రోమోలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ మధ్య సాగే సన్నివేశాలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
గౌతమ్ తిన్ననూరి, 'జెర్సీ' వంటి ఎమోషనల్ హిట్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో 'కింగ్‌డమ్'పై మంచి అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో చూపించబోతున్నట్లు ట్రైలర్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక అనిరుధ్ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా నిలవనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకుంది. జులై 31, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి మరి.