
- పేపర్ కట్టర్‌తో అమ్మాయిపై క్లాస్‌మేట్ దాడి
- తీవ్రంగా గాయపడి మృతి చెందిన యువతి
- కేరళలోని కొట్టాయం జిల్లాలో దారుణం
తిరువనంతపురం: అప్పుడే పరీక్ష రాసి బయటకొచ్చిన ఓ విద్యార్థినిపై తోటి స్టూడెంట్ పేపర్ కట్టర్(కత్తి)తో దాడి చేసి చంపేశాడు. కేరళలోని కొట్టాయం జిల్లాలో శుక్రవారం జరిగిందీ సంఘటన. ఎర్నాకులం జిల్లాలోని కూథట్టుకులం ప్రాంతానికి చెందిన అభిషేక్ బైజు, థలయోలపరంబుకు చెందిన నితినమోల్ (22).. కొట్టాయం జిల్లాలోని పాలాలో ఉన్న సెయింట్ థామస్ కాలేజీలో ఫుడ్ ప్రాసెసింగ్కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. శుక్రవారం సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఇద్దరూ కాలేజీకి వచ్చారు. ఎగ్జామ్ అయిపోయాక నితినమోల్ బయటకు రాగానే అభిషేక్ అడ్డుకున్నాడని, పేపర్ కట్టర్‌తో గొంతు కోసేశాడని పోలీసులు తెలిపారు. గాయపడిన అమ్మాయిని కొందరు స్టూడెంట్లు వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారన్నారు.
పారిపోకుండా అక్కడే కూర్చొని..
‘కాలేజీ ఆవరణలో నిందితుడు అమ్మాయితో గొడవపడటం చూశాను. అతను ఆమెను కింద పడేసి గొంతు కోశాడు. అమ్మాయి గొంతు నుంచి రక్తం కారడం గమనించి వెంటనే ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేశాను’ అని కాలేజీ సెక్యూరిటీ గార్డు చెప్పారు. దాడి చేశాక అభిషేక్ పారిపోలేదని, కొద్ది దూరంలో కూర్చుండిపోయాడని, పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉన్నాడని చెప్పారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.