2.20 కోట్ల మంది ఓటేసిన్రు..అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం

2.20 కోట్ల మంది ఓటేసిన్రు..అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం
  •     పోలింగ్​ కేంద్రాలు, పోస్టల్, హోం ఓటింగ్​ కలిపి 66.30 శాతం నమోదు
  •     పోలింగ్​ కేంద్రాల్లో 65.67 శాతం 
  •     అతితక్కువగా హైదరాబాద్​లో 48.48 శాతం
  •     వెల్లడించిన సీఈఓ కార్యాలయం

హైదరాబాద్, వెలుగు : లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 2,20,24,806 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు 66.30 శాతం మంది పోలింగ్​లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో రాత్రి పొద్దుపోయే వరకూ పోలింగ్  జరగడంతో రిటర్నింగ్  అధికారుల నుంచి వివరాలను తెప్పించుకున్న సీఈఓ వికాస్‌‌‌‌‌‌‌‌రాజ్..  మంగళవారం సాయంత్రం అధికారికంగా వివరాలను విడుదల చేశారు.  

రాష్ట్రంలోని మొత్తం 35,809 పోలింగ్  కేంద్రాల్లో 2,18,14,035 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. మిగిలిన 2,10,771 మంది ఓటర్  ఫెసిలిటేషన్  సెంటర్లలో, పోస్టల్ ఓటింగ్  రూపంలో, హోమ్ ఓటింగ్ పద్ధతిలో ఓటు వేశారని వివరించారు. పోలింగ్  కేంద్రాల్లో పోలైన ఓట్లు 65.67 శాతం ఉండగా మిగిలిన ఓట్లు ఆ మూడు రూపాల్లో పోలయ్యాయని చెప్పారు. దీంతో మొత్తం 66.30 శాతం పోలింగ్  నమోదైందని వెల్లడించారు. ‘‘పోలింగ్  కేంద్రాల్లో నమోదైన 65.67 శాతం ఓట్లు గత ఎన్నికలతో (2019లో జరిగిన) పోలిస్తే 3 శాతం ఎక్కువ.

అత్యధికంగా భువనగిరి లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గంలో 76.78 శాతం పోలింగ్ నమోదుకాగా అతితక్కువగా హైదరాబాద్  నియోజకవర్గంలో 48.48 శాతం నమోదైంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే నర్సాపూర్‌‌‌‌‌‌‌‌లో 84.25 శాతం నమోదుకాగా మలక్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 42.76 శాతం పోలింగ్  నమోదైంది. ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అత్యధికంగా మేడ్చల్  అసెంబ్లీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ (మల్కాజిగిరి ఎంపీ పరిధి) లో 3,85,149  ఓట్లు పోలయ్యాయి. అతితక్కువగా భద్రాచలం (మహబూబాబాద్ ఎంపీ పరిధి) లో 1,05,383 పోలయ్యాయి”

అని సీఈఓ వివరించారు. అలాగే సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ బైపోల్ లో 51 శాతం పోలింగ్​ నమోదైందని ఆయన తెలిపారు. ఇక షెడ్యూల్  ప్రకారం జూన్ 4న మొత్తం 17 ఎంపీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు 34 కౌంటింగ్  సెంటర్లలో జరుగుతుందని చెప్పారు.