కరోనా కట్టడికి 23 వేల కోట్లు

కరోనా కట్టడికి 23 వేల కోట్లు
  • రెండో విడత ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్స్’కు మోడీ కేబినెట్ ఆమోదం  
  • థర్డ్ వేవ్ కట్టడికి కేంద్రం ముందస్తు చర్యలు
  • 736 పీడియాట్రిక్ యూనిట్లు 
  • కొత్తగా 20 వేల ఐసీయూ బెడ్స్: మన్సుఖ్ మాండవీయ

న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టింది. వైరస్ పై పోరాటానికి రెండో విడత ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్యాకేజీ కింద రూ. 23,123 కోట్ల ఫండ్ ను ప్రకటించింది. కేంద్ర కేబినెట్ లో కొత్త మంత్రులు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ గురువారం తొలి కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో పాత, కొత్త మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. కరోనా కట్టడితో పాటు పలు అంశాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం తర్వాత కేబినెట్ నిర్ణయాలను హెల్త్ మినిస్టర్ మన్సు ఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయ, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సమాచార ప్రసార శాఖ, యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.

ప్యాకేజీల రాష్ట్రాల వాటా రూ. 8,123 కోట్లు 
కరోనాపై పోరులో భాగంగా దేశంలో హెల్త్ ఇన్‌‌  ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ‘కొవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్యాకేజీ ఫేజ్2’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ 9 నెలల పాటు ఈ ప్యాకేజీ అమలు అవుతుందన్నారు. ఇంతకుముందు ఫస్ట్ వేవ్ టైంలో మొదటి విడత ఎమర్జెన్సీ ప్యాకేజీ కింద కొవిడ్ దవాఖాన్లు, హెల్త్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 15 వేల కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్త ప్యాకేజీ కింద కేంద్రం తన వాటాగా రూ. 15 వేల కోట్లను, రాష్ట్రాలు తమ వాటాగా రూ. 8,123 కోట్లను ఖర్చు చేస్తాయన్నారు. ఈ ప్యాకేజీ సెంట్రల్ సెక్టార్, సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్స్ రూపంలో రెండు రకాలుగా అమలవుతుందని మాండవీయ చెప్పారు. కరోనా పేషెంట్లకు టెలీ కన్సల్టేషన్ సేవలను మరింత మెరుగుపరుస్తామి వివరించారు.

736 జిల్లాల్లో పీడియాట్రిక్ యూనిట్లు 
ఎమర్జెన్సీ ప్యాకేజీ కింద దేశంలోని 736 జిల్లాల్లో హెల్త్ ఇన్‌‌ ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేస్తామని హెల్త్​ మినిస్టర్ ​మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 736 పీడియాట్రిక్ యూనిట్లు ఏర్పటు అవుతాయన్నారు. 1,050 మెడికల్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకులు, 8,800 అంబులెన్స్ లు సిద్ధం అవుతాయన్నారు. కొత్తగా 2.40 లక్షల నార్మల్ మెడికల్ బెడ్లు, 20 వేల ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటిలో 20 శాతం బెడ్లను పిల్లలకు కేటాయిస్తామని అన్నారు

మార్కెట్ కమిటీలకు రూ. లక్ష కోట్లు: తోమర్
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) మండీల అభివృద్ధి కోసం రూ. లక్ష కోట్ల ఆర్థిక సహాయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. మార్కెట్ల కెపాసిటీ పెంచుకునేందుకు, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. ఏపీఎంసీలు ముగిసిపోతాయన్న ఆందోళనలు వద్దని, వీటిని మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోకోనట్ డెవలప్ మెంట్ బోర్డ్ యాక్ట్, 1979కి సవరణలు చేసేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కొత్త అగ్రికల్చర్ చట్టాలను రద్దు చేయబోమని తోమర్ మరోసారి స్పష్టం చేశారు. చట్టాలను రద్దు చేయడం కాకుండా, ఇతర ఏ పరిష్కారంతో వచ్చినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులకు ఇదివరకే చెప్పామన్నారు. రైతు సంఘాలు నిరసనలు ఇప్పటికైనా ఆపి, చర్చలు ప్రారంభించాలని కోరారు.