
- మేం వచ్చాకే 30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్లో ఐదేండ్ల పాటు 15శాతం నిధులు కేటాయిస్తేనే సర్కార్ బడులు బాగుపడ్తాయని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహించిన తెలంగాణ టీచర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘విద్యా రంగం పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. విద్యా వ్యవస్థ బాగు చేసేందుకు ఓ ఉద్యమం అవసరం. ఎడ్యుకేషన్ సెక్టార్ పరంగా ప్రపంచంలో మన దేశం 133వ స్థానంలో ఉన్నది.
దీనికి పాలకుల విధానాలే కారణం. ప్రజలకు విద్యను దూరం చేసి.. వారిని కేవలం ఓటర్లుగానే ఉంచాలని భావించడంతోనే ఈ దుస్థితి నెలకొన్నది’’అని ఆకునూరి మురళి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల మంది టీచర్లను నియమించిందని తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్‌కు ఫ్రీ కరెంట్ సప్లై చేస్తున్నామని, మండలానికో ఎంఈవోను నియమించామని చెప్పారు.
మెరుగైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణిపాల్ రెడ్డి, పోలంపల్లి ఆదర్శన్ రెడ్డి, ఏరుకొండ నరసింహ స్వామి, రమేశ్, మోహన్, 33 జిల్లాలకు చెందిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.