అస్సాంలో బాంబుల కలకలం

అస్సాంలో బాంబుల కలకలం
  • 19 చోట్ల అమర్చిన వేర్పాటువాద సంస్థ ఉల్ఫా

డిస్పూర్: స్వాతంత్ర్య దినోత్సవం రోజున అస్సాంలో బాంబులు కలకలం రేపాయి. ఇండిపెండెన్స్​డే వేడుకలను భగ్నం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 19 చోట్ల బాంబులు అమర్చినట్టు నిషేధిత వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్- ఇండిపెండెంట్ (ఉల్ఫా- (ఐ)) గురువారం ప్రకటించింది. ఎగువ అస్సాంలోని శివసాగర్, దిబ్రూగఢ్, గౌహతి, దిగువ అస్సాంలోని పలు ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బాంబు పేలుళ్లు జరిపి.. తమ సత్తా చాటుకుంటామని మిలిటెంట్​గ్రూప్ పేర్కొంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు శివసాగర్, నాగోన్‌తో సహా పలు ప్రాంతాల్లో కొన్ని అనుమానాస్పద వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే, సాంకేతిక కారణాల వల్ల ఉల్ఫా తన ఆపరేషన్‌ను విరమించుకుంది. సాధారణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా పేలుడు పదార్ధాలను రికవరీ చేసి ధ్వంసం చేయాలని ఓ పత్రికా ప్రకటన ద్వారా అభ్యర్థించింది. కాగా, టిన్సుకియా జిల్లాలోని మూడు చోట్ల, దిబ్రూగఢ్ జిల్లాలో ఒక చోట, గోలాఘాట్, సోరుపత్తర్‌లో ఒక్కో ప్రదేశంతో సహా మూడు చోట్ల బాంబులు అమర్చినట్టు ఉల్ఫా ప్రకటించినప్పటికీ కచ్చితమైన ప్రదేశాన్ని తెలపలేదు.