
బషీర్‌బాగ్, వెలుగు: ఇక నుంచి రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలూ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం మింట్ కాంపౌండ్ లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జోయల్ డేవిస్ పాల్గొని మాట్లాడారు. ఇటీవల స్కూల్స్ వద్ద చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో 35 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు. అందుకే ఉదయం పూట కూడా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇంతకు ముందు కేవలం రాత్రివేళల్లో మాత్రమే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉండేవని, ఇక నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా సర్ప్రైజ్ టీంలు తనిఖీలు చేస్తాయని చెప్పారు. స్కూల్ బస్ డ్రైవర్లపై యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బ్రీత్ ఎనలైజర్‌తో టెస్టులు చేశాక బస్సులు చేతికివ్వాలని చెప్పారు. తనిఖీల్లో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ రాములు, ఏసీపీ మోహన్, సైఫాబాద్ ట్రాఫిక్ సీఐ సైదిరెడ్డి పాల్గొన్నారు.
పద్మారావునగర్‌లో 10 కేసులు..
పద్మారావునగర్: పద్మారావునగర్ చౌరస్తా వద్ద బుధవారం సాయంత్రం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి బైక్ నడుపుతున్న 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు చిలకలగూడ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
కులుసుంపుర పీఎస్ పరిధిలో 11 కేసులు..
మెహిదీపట్నం: కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో మొగల్ కానాల చౌరస్తా వద్ద బుధవారం మధ్యాహ్నం డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో 11 మంది పట్టుబడగా వారిపై కేసులు నమోదు చేశారు.