మైనారిటీ గురుకుల స్టూడెంట్లకు మెడికల్ సీట్లు

మైనారిటీ గురుకుల స్టూడెంట్లకు మెడికల్ సీట్లు
  • నీట్ ఫేజ్–1 కౌన్సెలింగ్​లో సీట్లు దక్కించుకున్న 24 మంది
  • హైదరాబాద్​లోని ఐదు సీవోఈ కాలేజీల నుంచి ఎంపిక 
  • దసరా తర్వాత రూరల్​లో మరో10 కొత్త సీవోఈ కాలేజీలు
  • ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు:  ప్రైవేట్​ రెసిడెన్షియల్ ​కాలేజీల్లో లక్షలకు లక్షలు ఫీజులు చెల్లిస్తే తప్ప నీట్​ర్యాంక్​ రాని పరిస్థితి. అలాంటిది రాష్ట్రంలోని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ ​కాలేజీల్లో పైసా ఖర్చు చేయకుండా చదివిన 24 మంది విద్యార్థులు డాక్టర్ సీట్లు సాధించారు. నీట్ ఫేజ్​–1 కౌన్సెలింగ్​లోనే వివిధ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందారు. సెకండ్ ​ఫేజ్​లో మరికొందరికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ ​సిటీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు సెంటర్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​(సీఓఈ) కాలేజీల్లో చదివిన స్టూడెంట్లు వీళ్లు. ఈ నేపథ్యంలో సీఓఈ కాలేజీల పనితీరును గుర్తించిన ప్రభుత్వం దసరా తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా 10 కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరపున లాంఛనంగా ప్రారంభించడమే మిగిలి ఉంది.

ఐదు సీఓఈ కాలేజీల నుంచి 24 మంది

రాష్ట్ర మైనారిటీ గురుకుల సొసైటీ పరిధిలో 204 కాలేజీలున్నాయి. వీటిలో 107 బాయ్స్​, 97 గర్ల్స్​ కాలేజీలు. ఇందులో 75 శాతం మైనారిటీ, 25 శాతం నాన్​ మైనారిటీ స్టూడెంట్లకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఐఐటీ, జేఈఈ మెయిన్స్​, అడ్వాన్స్, నీట్​స్టూ డెంట్ల కోసం సెంటర్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​(సీఓఈ) పేరిట 5 చోట్ల కాలేజీలను ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్​లో బాయ్స్​, గర్ల్స్​, అలుగోల్​బాయ్స్​, గర్ల్స్​, బర్కాస్​ బాయ్స్​ కాలేజీలను సీఓఈ కాలేజీలుగా మార్చి  కోచింగ్​ ఇవ్వడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో పనిచేసే మంచి ట్రైన్డ్​ ఫ్యాకల్టీ లెక్చరర్లను ఇక్కడికి డిప్యూటేషన్​పై తీసుకొచ్చి పాఠాలు చెప్పించారు. స్టూడెంట్స్​కి బుక్స్​, మెటీరియల్​ అంతా కూడా ప్రభుత్వమే ఉచితంగా అందించింది.  మౌలిక వసతులు, మెరుగైన హాస్టల్ సౌకర్యాలతో  విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించింది.

రూరల్​  లో10 కొత్త సీఓఈ కాలేజీలు

సెంటర్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​(సీఓఈ) కాలేజీలలో ప్రిపేర్​ అవుతున్న స్టూడెంట్లు డాక్టర్​ సీట్లు సాధిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం సీఓఈ కాలేజీలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి సమాయత్తం అవుతోంది. ఇప్పటిదాకా మైనారిటీ సీఓఈ కాలేజీలన్నీ కూడా హైదరాబాద్​లోనే ఉండగా దసరా తర్వాత రూరల్​ ఉమ్మడి జిల్లాకోకటి చొప్పున ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేసింది. నిర్మల్ బాయ్స్-1, నిజామాబాద్ గర్ల్స్-3, నిజామాబాద్ నగరం బాయ్స్-1, కరీంనగర్ బాయ్స్-1, ఖమ్మం గర్ల్స్-1, మహబూబ్‌‌‌‌నగర్ గర్ల్స్-1, దేవరకద్ర బాయ్స్-2,  నల్గొండ గర్ల్స్-1,  వరంగల్ గర్ల్స్-1, గోల్కొండ గర్ల్స్-2 కాలేజీలను సీఓఈ కాలేజీలుగా ప్రకటించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా అంతర్గతంగా స్టూడెంట్లకు ఎంట్రన్స్​ పరీక్షలు నిర్వహించింది.దసరా తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి లక్ష్మణ్​ ఈ కాలేజీలను ప్రారంభించనున్నట్లుగా మైనారిటీ డిపార్టెమెంట్​ఆఫీసర్లు ప్రకటించారు.  

సీట్లు పొందిన విద్యార్థులంతా పేదలే.. 

మైనారిటీ సీఓఈ కాలేజీల్లో చదివి డాక్టర్​ సీట్లు పొందిన విద్యార్థులలో 17 మంది బాయ్స్​, ఏడుగురు గర్ల్స్​ ఉన్నారు. ఈ స్టూడెంట్స్​ అంతా  పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవాళ్లే. ప్రైవేట్​ కాలేజీల్లో లక్షలకు, లక్షలు పోసి చదువు కొనలేక గవర్నమెంట్​ కాలేజీలలో చేరినవాళ్లే. ఇక్కడి వసతి సౌకర్యాలను ఆసరాగా చేసుకొని లెక్చరర్స్​ చెప్పిన లెస్సన్స్​ శ్రద్ధగా విని నీట్​ఎగ్జామ్​కు ప్రిపేర్​ అయ్యారు. దీంతో ఈ ఏడాది నిర్వహించిన పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్​ పొంది డాక్టర్​ సీట్లు సాధించారు. బార్కాస్ బాయ్స్​ కాలేజీ నుంచి 10 మంది బాయ్స్​, అలుగోల్​ గర్ల్స్​ నుంచి ఆరుగురు అమ్మాయిలు అత్యధికంగా డాక్టర్​ సీట్లు పొందినట్లుగా మైనారిటీ గురుకుల సొసైటీ ప్రతినిధులు ప్రకటించారు. వీరిలో మహ్మద్​ సుమైర్​ అహ్మద్​, వి. కృష్ణ కౌశిక్​, మెహ్రాన్​, మహ్మద్​ షఫీ ఉద్దీన్​ సిద్దిఖీ, సయ్యద్​ మెహమ్మద్​ తౌఫికుద్దీన్​, అబ్దుల్​ దస్తగీర్​, మహ్మద్​ అఫ్రాజ్​, సయ్యద్​ ఇక్రమ్​ ఉద్దీన్​, ఎనకతల శ్రవణ్​ కుమార్​, గుగులోతు ప్రేమ్​ చంద్​, ఎండీ ఓబెద్​, గౌతం ఖన్నా, సృశన్​ కుమార్​, ఎండీ ఫిర్​దౌస్​, హఫ్సా ఫాతిమా, షేక్​ సమీనా మాధర్,  గాలి అనూష, తహసీన్​ ఖమర్​, సి.ప్రియ ఎంజిల్​ఉన్నారు.