అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దేశాలపై టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్లో ప్రభుత్వంపై జరుగుతున్న ప్రజా నిరసనలను అణచివేసేందుకు అక్కడి పాలకులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలు అమెరికాతో వ్యాపారం చేయాలంటే 25% అదనపు టారిఫ్ కట్టాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన స్టార్ట్ అయ్యింది.
ఇప్పటికే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 50% వరకు టారిఫ్‌లు ఉండగా.. తాజా నిర్ణయంతో ఇది 75%కి చేరుకోవచ్చనే ఆందోళన భారతీయ ఎగుమతిదారుల్లో స్టార్ట్ అయ్యాయి. ఇదే జరిగితే తమ వ్యాపారాలు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు భారత్ పై ట్రంప్ కామెంట్స్ ప్రభావం ఎలా ఉంటుందో గమనిస్తే..
భారత్ పై ప్రభావం..
భారత్-ఇరాన్ మధ్య ఏటా సుమారు రూ.15వేల కోట్ల వరకు వాణిజ్యం జరుగుతోంది. అయితే ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ ఇరాన్ నుండి సుమారు512 మిలియన్ డాలర్ల విలువైన ఆర్గానిక్ కెమికల్స్ దిగుమతికి ఆటంకం కలగనుంది. ఇవి ఇప్పుడు మరింత ప్రియం కానున్నాయి. దీనికి తోడు బాదం, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ దిగుమతులు భారత్‌కు ప్రియంగా మారి వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటికీ తోడు ముఖ్యమైన మ్యాటర్ చాబహార్ పోర్ట్. ఇరాన్‌లోని ఈ పోర్ట్ ద్వారా భారత్ మధ్య ఆసియా దేశాలకు వ్యాపారం చేస్తోంది. అమెరికా ఆంక్షల వల్ల ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారవచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో.. ట్రంప్ విధిస్తున్న ఈ గ్లోబల్ టారిఫ్స్ చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. బుధవారం వచ్చే తీర్పు ట్రంప్‌కు వ్యతిరేకంగా వస్తే.. ఈ టారిఫ్‌ల అమలు ఆగిపోవచ్చు. అది భారత్ వంటి దేశాలకు పెద్ద ఊరటనిస్తుంది. ఒకవేళ కోర్టు ట్రంప్‌కు మద్దతు ఇస్తే మాత్రం భారత ఎగుమతిదారులు అమెరికా మార్కెట్లో భారీ పోటీని ఎదుర్కోక తప్పదు. ఇదీ అమెరికాకు ఎగుమతులను తగ్గించి ట్రేడ్ డెఫిసిట్ పెంచుతుందని ఆందోళనలు ఎగుమతిదారులు వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు ఇరాన్‌పై సైనిక దాడులు చేసే ఆలోచనలో ఉన్న అమెరికా, మరోవైపు ఇలాంటి ఆర్థిక ఆంక్షలతో ప్రపంచ దేశాలను ఇరాన్‌కు దూరం చేయాలని చూస్తోంది. భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకుంటూ.. అమెరికాతో చర్చల ద్వారా ఈ టారిఫ్ సెగ తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది.
