దేశీయ టాప్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కు భారీ షాక్ తగిలింది. తన టాప్-3 క్లయింట్లలో ఒకటైన జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం డైమ్లర్ నుంచి సుమారు 150 మిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.వెయ్యి 250 కోట్ల వార్షిక ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదంలో ఇన్ఫోసిస్ చిక్కుకుంది. ఎగ్జిక్యూషన్ ఆలస్యం కావడంతో డైమ్లర్ కొత్త వెండర్ కోసం వెతుకుతుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ వార్తలతో ఇన్ఫోసిస్ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.
డీల్‌లో అసలు చిక్కు ఎక్కడ..?
2020 డిసెంబర్‌లో ఇన్ఫోసిస్ డైమ్లర్‌తో 3.2 బిలియన్ డాలర్ల విలువైన 8 ఏళ్ల ఐటీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ అనే విభాగం అతి పెద్దది. దీని కింద సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్లు, ఎక్విప్మెంట్ సరఫరా వంటి పనులను ఇన్ఫోసిస్ చూసుకుంటోంది. అయితే బిల్లింగ్ సమస్యాలు, పనుల అమలులో జాప్యం కారణంగా డైమ్లర్ అసహనంతో ఉన్నట్లు సమాచారం. 2021 నుండి డైమ్లర్ సంస్థ సుమారు 47 మిలియన్ డాలర్ల బకాయిలను ఇన్ఫోసిస్‌కు పెండింగ్ పెట్టింది. సైబర్ సెక్యూరిటీ వంటి కొన్ని సేవలు 2029 వరకు పొడిగించినప్పటికీ.. ప్రధానమైన వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ కాంట్రాక్ట్ రెన్యూవల్ విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే భారత్‌కు చెందిన మరో టాప్ ఐటీ సంస్థ ఈ కాంట్రాక్ట్ కోసం బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
డైమ్లర్ ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థ 'ఇన్ఫోసిస్ ఆటోమోటివ్' ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో 8.5% క్షీణించి 418 మిలియన్ డాలర్లకు పడిపోయింది. గత రెండేళ్లుగా ఈ విభాగం నష్టాల్లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ టెన్షన్లు, ఆటోమేషన్ కారణంగా క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్లను తగ్గిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి మెగా డీల్ చేజారడం ఇన్ఫోసిస్ వృద్ధిపై భారీగానే ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన క్యూ3 ఫలితాల్లో లాభం స్వల్పంగా పెరిగినప్పటికీ.. భవిష్యత్తు ఆదాయ అంచనాల విషయంలో కంపెనీ జాగ్రత్తగా వ్యవహరించింది. క్లయింట్లు ఖర్చు తగ్గించుకోవడం, అమెరికా-జర్మనీ వంటి దేశాల్లో ఆర్థిక అనిశ్చితి వల్ల కొత్త డీల్స్ రావడం సవాలుగా మారింది. డైమ్లర్ వంటి భారీ కస్టమర్ల ఖాతాలో కోత పడటం ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఇదే బాటలో గతంలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి సంస్థలు కూడా తమ పెద్ద కాంట్రాక్టులను మధ్యలోనే కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామం భారత ఐటీ రంగం ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులకు అద్దం పడుతోంది.
