రిటైర్డ్ డాక్టర్‌పై 250 అత్యాచారం కేసులు

రిటైర్డ్ డాక్టర్‌పై 250 అత్యాచారం కేసులు

దేవుడు జన్మనిస్తే.. డాక్టర్ పునర్జన్మని ఇస్తాడు. అందుకే డాక్టర్లు దేవుళ్లతో సమానం అంటారు. అలాంటి గొప్ప స్థానంలో ఉండి డాక్టర్ వృత్తికే పెద్ద కళంకం తెచ్చాడొ డాక్టర్. ఫ్రాన్స్‌కు చెందిన 68 ఏళ్ల జోయెల్ లే స్కార్నెక్ ఫ్రాన్స్‌లో డాక్టర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయన నలుగురు మైనర్లపై అత్యాచారం చేశాడని కేసు నమోదైంది. అంతేకాకుండా ఈ డాక్టర్ దాదాపు 200 మంది పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడి ఉండవచ్చనే ఆరోపణలు కూడా ఉన్నాయని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న లాయర్ అన్నారు. ఈ కేసు ఫ్రాన్స్‌లోనే అతిపెద్ద పెడోఫిలియా కేసుగా నమోదైందని ఆయన అన్నారు. పక్కింటి ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడని స్కార్నెక్‌పై 2017లో తొలి కేసు నమోదైంది.

స్కార్నెక్ వారి బంధువులను కూడా వదిలిపెట్టలేదు. ఆయనకు సంబంధించిన ఒక బంధువుపై అత్యాచారం చేశాడని, మరొక బంధువుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన ఇంట్లో తనిఖీలు చేసి కొన్ని డైరీలను స్వాధీన పరచుకున్నారు. వాటితో పాటు పిల్లల నీలి చిత్రాలు మరియు సెక్స్ బొమ్మలను పోలీసులు స్వాధీన పరచుకున్నారు.

డైరీలలో స్కౌర్నెక్ పిల్లలతో ఎలా ప్రవర్తించేవాడో కళ్లకు కట్టినట్లుగా పూర్తిగా రాసి ఉంది. స్కౌర్నెక్ డైరీలలో పిల్లల పేర్లను కూడా రాసి పెట్టడంతో… పోలీసులకు కేసును పరిశోధించడానికి ఆ డైరీ చాలా ఉపయోగపడింది. ఆ డైరీల ద్వారా స్కౌర్నెక్ బాధితులు 250 మంది వరకు ఉంటారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లారెంట్ జుచోవిచ్ అన్నారు. డైరీలో ఉన్న పేర్ల ద్వారా ఇప్పటివరకూ 209 మందిని ప్రశ్నించామని ఆయన అన్నారు. వారిలో చాలా మందికి ఆనాటి భయంకరమైన విషయాలు ఇంకా గుర్తున్నాయని ఆయన అన్నారు. స్కౌర్నెక్ దాడికి పాల్పడిన సమయంలో 181 మంది మైనర్లేనని పోలీసులు తేల్చారు. పిల్లలు వారు అనుభవించిన బాధను బాగా గుర్తుంచుకుంటారు, కానీ వాళ్లు దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు ఎందుకంటే వాళ్లు భయపడ్డారు బాధితుల తరపు న్యాయవాది ఫ్రాన్సిస్కా సత్తా అన్నారు.

గతంలో పిల్లల అశ్లీల చిత్రాలను కలిగి ఉన్నాడనే కారణంతో లే స్కౌర్నెక్‌కు 2005లో కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. ఇది ఇలా ఉండగా.. 2017లో బాలికపై అత్యాచారం ఆరోపణలో స్కౌర్నెక్‌ దోషిగా తేలితే అతనికి కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తుంది.