
- 300 సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కనెక్షన్
- టికెట్ల అమ్మకం పేటీఎంకు ఇచ్చినం.. మాకు సంబంధం లేదు: అజరుద్దీన్
- అమ్మకాల్లో గోల్మాల్.. లెక్క తేలని 12 వేల టికెట్లు!
హైదరాబాద్, వెలుగు: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియా–ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబవుతోంది. పిచ్, ఔట్‌ఫీల్డ్, స్టేడియాన్ని హెచ్‌సీఏ సిబ్బంది రెడీ చేస్తున్నారు. వర్షం కురిస్తే ఔట్ ఫీల్డ్ దెబ్బతినకుండా శుక్రవారం సాయంత్రం గ్రౌండ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. మూడేళ్లుగా ఐపీఎల్, ఇంటర్నేషనల్ సహా మెజారిటీ మ్యాచ్‌లు లేకపోవడంతో స్టాండ్స్‌లోని కుర్చీలు దుమ్మూ, ధూళితో నిండిపోయి కొంత అస్తవ్యస్తంగా మారాయి. స్టాఫ్ వాటిని బాగుచేస్తున్నారు. మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 300 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. క్యూలైన్లు, పార్కింగ్ ఏరియాల కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి కనెక్ట్ చేస్తున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బందోబస్తు ఏర్పాట్ల వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. స్టేడియంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా చెక్ చేసేందుకు ఎంట్రీ గేట్స్ వద్ద అధునాతన స్కానర్లను, డాగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రెండు యూనిట్ల ఆక్టోపస్, షార్ప్ షూటర్స్, మౌంటెడ్ పోలీసులతో గస్తీ నిర్వహిస్తారన్నారు. మహిళా ప్రేక్షకుల రక్షణ కోసం షీ టీమ్స్, యాంటీ -ఈవ్-టీసింగ్ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. షీ టీమ్స్ పోలీసులు మఫ్టీలో నిఘా పెడతారన్నారు. వెహికల్స్ పార్కింగ్ కోసం 21 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
టికెట్ల అమ్మకం థర్డ్ పార్టీకి: అజర్
టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలతో తమకు సంబంధం లేదని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజరుద్దీన్ ప్రకటించారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టికెట్లను మేం థర్డ్ పార్టీకి ఇచ్చినం. ఇంక వాటితో మాకేం సంబంధం? అందులో మేం ఇన్వాల్వ్ అయ్యే చాన్స్ ఉందా? నిన్న జరిగిన ఘటన బాధాకరం. మమ్మల్ని ఎలా నిందిస్తారు?’ అని అన్నారు. పాసుల విషయంలో ముందు నుంచే సరైన సమాచారం ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. టికెట్లు కొనుక్కున్న వాళ్లు బ్లాక్‌లో అమ్మితే తమకేం సంబంధం అని అన్నారు. తమ మెంబర్స్ టికెట్లను బ్లాక్ చేస్తే మాత్రం బాధ్యత వహిస్తామన్నారు.
అజర్‌పై హెచ్ఆర్ సీలో ఫిర్యాదు
టికెట్ల అమ్మకాల్లో హెచ్ సీఏ ప్రెసిడెంట్ అజరుద్దీన్ అవినీతికి పాల్పడ్డారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం స్టేట్ హెచ్ఆర్సీ(హ్యూమన్ రైట్స్ కమిషన్ )లో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తర్వాత యుగంధర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మ్యాచ్ టికెట్ల కోసం వచ్చిన క్రీడాభిమానులపై లాఠీచార్జ్ కు కారకులైన అజారుద్దీన్, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఏర్పాట్లపై సుప్రీంకోర్టు కమిటీ వీడియో కాన్ఫరెన్స్
హెచ్‌సీఏ పరిపాలన కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ టీ20 మ్యాచ్ ఏర్పాట్లను సమీక్షించింది. కమిటీ హెడ్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్‌ఏ కక్రూ.. శుక్రవారం సభ్యులు అజనీ కుమార్, వెంకటపతి రాజు, వంకా ప్రతాప్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాటాదారులంతా మ్యాచ్ సజావుగా జరగడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలని జస్టిస్ కక్రూ సూచించారు. అదే సమయంలో మ్యాచ్ ఏర్పాట్లలో తలదూర్చకూడదని కమిటీ నిర్ణయించింది. ఈ నెల 26న జస్టిస్ కక్రూ హైదరాబాద్‌కు వచ్చి... సుప్రీం మార్గనిర్దేశాల ప్రకారం హెచ్‌సీఏతో రివ్యూ చేయనున్నారు.
12 వేల టికెట్లు ఏమయ్యాయ్
పేటీఎంలో రెండు విడతల్లో 13,500 టికెట్లు, జింఖానా కౌంటర్లలో మరో 3 వేల టికెట్లు విక్రయించినట్టు అజర్ తెలిపారు. ‘ఈ నెల 15న ఆన్‌లైన్ ద్వారా 11,450 టికెట్లు అమ్మినం. కార్పొరేట్ బాక్సులకు సంబంధించి 4 వేల టికెట్లను అమ్మాం. జింఖానా లో ఆఫ్‌లైన్‌లో 3 వేల టికెట్లు అందుబాటులో ఉంచాం. ఆపై ఆన్‌లైన్‌లో మరో 2,100 టికెట్లు అమ్మినం. ఇంటర్నల్ పార్ట్‌నర్స్, స్టేక్ హోల్డర్స్‌కు 6 వేల టికెట్లు ఇచ్చాం’ అని ఆయన తెలిపారు. మొత్తం 26,550 టికెట్లు అవుతున్నాయి. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39 వేలు. అయితే మిగతా 12 వేల పైచిలుకు టికెట్ల లెక్క అజర్ చెప్పలేదు. ఇందులో కాంప్లిమెంటరీ పాసులు ఎన్నో కూడా వెల్లడించలేదు. సాధారణంగా 5 నుంచి 7 వేల టికెట్లను కాంప్లిమెంటరీగా వివిధ వాటాదారులకు ఇస్తారు. అలా చూసుకున్నా మరో ఐదు వేల టికెట్లు మిగులుతాయి.
‘టికెట్ల అమ్మకాల్లో అవినీతి’
క్రికెట్ టికెట్ల అమ్మకాల్లో భారీ అవినీతి జరిగిందని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ హఫీజ్ పేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజరుద్దీన్ పేటీఎంకు కాంట్రాక్టు ఇవ్వడంలోనే అవినీతి ఉందన్నారు. కేవలం 20 నిమిషాల్లోనే 30 వేలకు పైగా టిక్కెట్లు ఎలా అమ్ముడుపోతా యని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టికెట్ల విషయంలో ఎంటరయ్యారన్నారు. అందరూ కలిసి టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నా రని ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ అని, ఇది బీసీసీఐ ఆదేశాలతోనే టికెట్లు అమ్ముతున్నదని వివరించారు. మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో సర్కార్‌కు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.
అజర్ తీరుతోనే అసలు సమస్య
అజరుద్దీన్ ఒంటెద్దు పోకడే హెచ్‌సీఏలో అన్ని సమస్యలకు కారణం అవుతున్నదని మాజీ సభ్యులు విమర్శిస్తున్నారు. గతంలో ఎవరు అధికారంలో ఉన్నా.. మ్యాచ్ టైమ్‌లో కలసికట్టుగా పని చేసేవాళ్లు. వివిధ పనుల కోసం కమిటీలను ఏర్పాటు చేసి ఎవరి బాధ్యతలను వారికి అప్పగించేవాళ్లు. టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అమ్మి అభిమానులకు ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. నిబంధనల ప్రకారం స్టేడియం సీటింగ్ కెపాసిటీలో నిర్ణీత మొత్తం కాంప్లిమెంటరీ పాసులను జారీ చేసి.. హెచ్‌సీఏ సభ్యులతో పాటు ఇతర వాటాదారులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులకు ముందుగానే చేరవేసి సమస్య రాకుండా చూసుకున్నారు. కానీ, ప్రస్తుతం మ్యాచ్ ఏర్పాట్లతో పాటు టికెట్లు, కాంప్లిమెంటరీ పాసుల కేటాయింపు మొత్తం అజర్ కనుసన్నల్లోనే జరుగుతోంది. సెక్రటరీ విజయానంద్ సహా మిగతా సభ్యులంతా చేష్టలుడిగి చూస్తున్నారు.
పాసుల కోసం హెచ్‌సీఏ సభ్యులు, క్లబ్ కార్యదర్శులే అజర్ దర్శనం కోసం వేచి చూడాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ‘అజర్ ఒంటెద్దు పోకడలు చూపిస్తున్నాడు. హెచ్‌సీఏ సభ్యులు, మాజీ క్రికెటర్లు, క్లబ్ కార్యదర్శులను అస్సలు పట్టించుకోవడం లేదు. ఎవ్వరేం చెప్పినా వినకుండా.. నచ్చినట్టు చేస్తున్నడు. 20..30 ఏండ్లుగా హెచ్‌సీఏలో ఉంటున్న.. ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ చూడలేదు’ అని ఓ క్లబ్ కార్యదర్శి వాపోయారు. అజర్ తనకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని సెక్రటరీ విజయానంద్ ఆరోపించారు. ‘‘మా మధ్య విభేదాలు ఉన్నా మ్యాచ్ నిర్వహణ కోసం కలిసి పని చేస్తున్నాం. కానీ, పాసుల దగ్గర నుంచి ఏర్పాట్ల వరకు, నన్ను, ఇతర మెంబర్లను అజర్ పట్టించుకోవడం లేదు. సభ్యులకు నేను సమాధానం చెప్పలేకపోతున్నా’’ అని అన్నారు.