
ముంబైలోని ఆరే కాలనీలో చెట్ల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. మెట్రో కారు పార్కింగ్ షెడ్ నిర్మాణం కోసం అధికారులు 2 వేల ఐదు వందల చెట్ల తొలగిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చెట్ల నరికివేతను నిరసిస్తూ సామాజిక కార్యకర్తులు, పర్యావరణ వేత్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భద్రతను భారీగా పెంచారు. ఆరే కాలనీలో 144 సెక్షన్ విధించారు. కొందరు కార్యకర్తలను అరెస్టు చేశారు.
మెట్రో పార్కింగ్ కోసం ఆరే కాలనీలోని వేలాది చెట్లను తొలగించాలని ముంబై మెట్రో నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా రెండేళ్లుగా పర్యావరణ వేత్తలు పోరాటం చేస్తున్నారు. అయితే చెట్ల నరికివేతను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను నిన్న బాంబే హైకోర్టు కొట్టివేసింది. దీంతో రాత్రికి రాత్రే మెట్రో సిబ్బంది రంగంలోకి దిగారు. ఉదయానికే దాదాపు 2 వందల చెట్లను కూల్చేశారు. చెట్ల నరికివేస్తున్నారనే విషయం తెలుసుకున్న స్వచ్ఛంద కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. దీంతో మెట్రో సిబ్బంది కొంత వెనక్కి తగ్గారు.
ఆరే కాలనీలో చెట్ల నరికివేతను బీజేపీ మిత్ర పక్షం శివసేన తప్పుపట్టింది. చెట్లను నరికివేయడం, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అని ఆదిత్య థాకరే మండిపడ్డారు. చెట్లను కూల్చడానికి బదులు.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను కూల్చాలని హితవు పలికారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగానికి.. ముంబైలో జరుగుతన్నది విరుద్ధంగా ఉందన్నారు ఆదిత్య థాకరే. ఇక ఆరే కాలనీ దగ్గరకు వచ్చిన శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేదిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగింది.
మరోవైపు కేంద్ర మంత్రి జవదేకర్ మాత్రం చెట్ల నరికివేను సమర్థించారు. అభివృద్ధి, పర్యావరణ సమతులత్య ఒకే రీతిలో సాగాలన్నారు. ఆరే అటవీ ప్రాంతం కాదని బాంబే హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందన్నారు జవదేకర్.