- ఏడు జిల్లాల్లో లెక్కలు తేల్చిన కాగ్
- ఫేక్ ఇన్వాయిస్లతో నిధులు పక్కదారి
- గొర్రెలు ట్రాన్స్ పోర్ట్ చేయకపోయినా చేసినట్టు లెక్కలు
హైదరాబాద్, వెలుగు: గొర్రెల పంపిణీ స్కీమ్ అమలులో పెద్దఎత్తున అవినీతి జరిగినట్టు కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఏడు జిల్లాల్లో కొన్ని చోట్ల తనిఖీ చేయగా రూ.253.93 కోట్ల మేర సందేహాస్పద, మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు గుర్తించింది. స్కీమ్ అమలులో చాలా లోపాలు జరిగినట్టు తేల్చింది. ప్రధానంగా రూ.68.23 కోట్లు విలువ చేసే ఫేక్ ఇన్వాయిస్లతో గొర్రెల రవాణా జరిగినట్టు బహిర్గతం చేసింది. అదేవిధంగా, రూ.27.20 కోట్ల మేర ట్రాన్స్పోర్ట్ వాహనాలు, వాటి నంబర్లు, ఇన్వాయిస్లో ఉన్న చెల్లింపులు అన్నీ నకిలీ అని తేల్చింది.
చిన్నపాటి సరుకు రవాణా వాహనాలు, ట్రాక్టర్లలో రెండు కంటే ఎక్కువ గొర్రెల యూనిట్లను రవాణా చేసినట్టు చూపించి రూ.17.06 కోట్ల అవినీతికి పాల్పడినట్టు కాగ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. భారీ గూడ్స్ వాహనాల్లో ఆరు కంటే ఎక్కువ గొర్రెల యూనిట్లు ట్రాన్స్పోర్ట్ చేసినట్టు చూపించి రూ.46.03 కోట్లు పక్కదారి పట్టించినట్టు గుర్తించింది. కొన్ని గొర్రెలకు నకిలీ ట్యాగులు కేటాయించి రూ.92.69 కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్టు కాగ్ పేర్కొంది.
అదేవిధంగా నార్తర్న్ డిస్కమ్‌కు జరిగిన నష్టాన్ని కూడా తన రిపోర్ట్‌లో ప్రస్తావించింది. 2014, జూన్ నుంచి 2018, జులై దాకా ఉన్న బకాయిలు చెల్లించకపోయినా... సిర్పూర్ పేపర్ మిల్లుకు నార్తర్న్ డిస్కమ్ కరెంట్ సరఫరా చేసినట్టు గుర్తించింది. దీంతో డిస్కమ్ రూ.50.37 కోట్ల మేర నష్టం పోయినట్టు కాగ్ తేల్చింది.
