గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట రూపం

గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట రూపం
  • రాజస్తాన్‌‌‌‌, కర్నాటక కంటే పటిష్టంగా ముసాయిదా
  • అగ్రిగేటర్ల లావాదేవీలపై ‘వెల్ఫేర్​ సెస్​’ విధింపు
  • మూడు లక్షల మందికి పైగా కార్మికులకు ‘సామాజిక భద్రత బోర్డు’ భరోసా
  • రాహుల్​గాంధీ హామీ మేరకు గిగ్ వర్కర్స్​ బిల్లు
  • వారికి న్యాయం చేయాలన్నదే మా ఆలోచన: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేస్తం: మంత్రి వివేక్‌‌
  • ఉద్యోగ భ‌‌ద్రత, బీమా సౌక‌‌ర్యం, చెల్లింపుల విష‌‌యంలో స్పష్టమైన విధానాలు 
  • చట్టంలోని రూల్స్​ అండ్​ రెగ్యులేషన్స్​ చేంజ్​ చేసుకునే వెసులుబాటు
  • గిగ్‌‌ వర్కర్లకు న్యాయం చేయాలన్నదే మా ఆలోచన
  • సిగాచి బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల దాకా పరిహారం ఇచ్చామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్ల బిల్లును రాష్ట్ర కేబినెట్‌‌ ఆమోదించిందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. త్వరలోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. చట్టంగా మారుస్తామని చెప్పారు. గిగ్ వర్కర్లకు న్యాయం చేయాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. సోమవారం కేబినెట్‌‌ భేటీ అనంతరం మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు.

‘‘ఈ కొత్త చట్టం ప్రకారం.. గిగ్ వర్కర్లు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే, అగ్రిగేటర్లు కూడా ఈ బోర్డులో భాగమై వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అగ్రిగేటర్లలో గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించే సదుపాయం కూడా ఉంది” అని వివరించారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత  సెస్  కలెక్ట్ చేసి, ఆ నిధులను గిగ్ వర్కర్లకు వైద్యపరమైన ఇబ్బందులు (మెడికల్ ఇష్యూస్), ప్రమాదవశాత్తు మరణాలు (యాక్సిడెంటల్ డెత్) లాంటి సందర్భాల్లో సదుపాయాలు కల్పించడానికి ఉపయోగించే వీలుంటుందని వివరించారు.

రాష్ట్రంలో 4 లక్షల మంది గిగ్‌‌ వర్కర్స్‌‌
అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత గిగ్ వర్కర్లకు న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామని మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి తెలిపారు.  అవసరాన్ని బట్టి చట్టంలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌‌లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫామ్‌‌ బేస్డ్ వర్కర్స్ ఉన్నారన్నారు. మొబిలిటీ, ఫుడ్  డెలివ‌‌రీ, ఈ కామర్స్,  లాజిస్టిక్స్‌‌, ఇత‌‌ర రంగాల్లో వారంతా పనిచేస్తున్నారని చెప్పారు. వీరికి ఎలాంటి సెల‌‌వులు లేక‌‌పోగా రోజుకు 10 నుంచి 12 గంట‌‌లు ప‌‌ని చేయాల్సి వ‌‌స్తున్నదని అన్నారు.

‘‘గిగ్ వ‌‌ర్కర్లకు ఉద్యోగ భ‌‌ద్రత, బీమా సౌక‌‌ర్యం, చెల్లింపుల విష‌‌యంలో స్పష్టమైన విధానాలు లేవు. వారి సంక్షేమం, భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే   ప్రకటించాం.  అందులో భాగంగానే గిగ్ వర్కర్లకు సామాజిక భ‌‌ద్రత‌‌, వారి ఫిర్యాదుల ప‌‌రిష్కారం, గుర్తింపు త‌‌దిత‌‌ర అంశాల‌‌పై  సీఎం రేవంత్‌‌రెడ్డి 2024 డిసెంబ‌‌రు 23న గిగ్ వ‌‌ర్కర్లు, సంబంధిత ప్రతినిధులతో స‌‌మావేశ‌‌మ‌‌య్యారు. వారితో పలుమార్లు సంప్రదింపులు జరిపి గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఈ బిల్లును తీసుకొచ్చాం” అని తెలిపారు.

సిగాచి ప్రమాద ఘటన తర్వాత చేపట్టిన తదుపరి చర్యలపై కేబినెట్‌‌లో చర్చించినట్లు మంత్రి వివేక్ తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.45 నుంచి 50 లక్షల వరకు నిధులను ఇప్పటికే  పంపిణీ చేసినట్లు చెప్పారు. పెండింగ్ సమస్యలు, సిగాచి మేనేజ్‌‌మెంట్ ప్రతిపాదనల గురించి చర్చించడానికి ఈ నెల 20న మరొక సమావేశం ఏర్పాటు చేయనున్నామని, ఆ మీటింగ్ తర్వాత మరిన్ని వివరాలు అందిస్తామని వెల్లడించారు.