- ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు
పినపాక/సంగారెడ్డి (రామచంద్రాపురం)/నల్గొండ, వెలుగు : 2026 జనగణన నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రీ టెస్ట్ సెన్సెస్ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. పినపాక మండలంలోని ఏడు రెవెన్యూ గ్రామాల్లో ఈ సర్వే నిర్వహిస్తుండగా, 44 మంది టీచర్లకు ఎన్యూమరేటర్లగా, మరో ఏడుగురికి సూపర్‌వైజర్లుగా బాధ్యతలు అప్పగించారు.
వీరికి ఈ నెల 2 నుంచి మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. అనంతరం ఒక్కో ఎన్యూరేటర్‌కు సుమారు 150 నుంచి 200 ఇండ్లను కేటాయించారు. వారి సెల్‌ఫోన్లలో డిజిటల్ లేఅవుట్, హౌస్ లిస్టింగ్ అనే రెండు యాప్‌లను ఇన్‌స్టాల్ చేశారు. ప్రస్తుతం ఆయా ఇండ్లలోని కుటుంబాల వివరాలన్నీ ఈ యాప్‌లోనే నమోదు చేస్తున్నారు.
తొలుత నివాస గృహాల జియోట్యాగింగ్
శిక్షణ అనంతరం ఈ నెల 10వ తేదీ నుంచి ఎన్యూరేటర్లు డిజిటల లేఅవుట్ యాప్‌లో ఇండ్లకు జియోట్యాగింగ్ చేశారు. శనివారం నుంచి హౌస్ లిస్టింగ్ యాప్‌లో వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి యజమని పేరు, ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు ? రైస్ తింటారా ? లేదంటే గోధుమలు, జొన్నలతో చేసిన రొట్టెలు తింటారా ? ఉండేది పెంకుటిల్లా ? కాంక్రీట్ స్లాబా ? ఇటుకలతో కట్టిన గోడలా ? మట్టి గోడలా ? టాయిలెట్ ఉందా ? ఉంటే దానికి పైకప్పు ఉందా ? డ్రైనేజీ సౌకర్యం ఉందా ? ఇంట్లో టీవీ ఉందా? ఉంటే డీటీహెచ్ కనెక్షన్ ఉందా? టూవీలర్, కారు ఉన్నాయా? వంటి వివరాలు అడుగుతూ వెంటవెంటనే యాప్‌లో నమోదు చేస్తున్నారు.
